Monday, November 25, 2024

మోడీ అయోధ్యలో పోటీ చేయాలనుకున్నారు: రాహుల్

- Advertisement -
- Advertisement -

వద్దని బిజెపి సర్వేయర్లు చెప్పారు
కెరీర్ ముగుస్తుందని సూచన
అహ్మదాబాద్‌లో రాహుల్ గాంధీ వెల్లడి
గుజరాత్‌లో ఈసారి గెలుపు మా కూటమిదే

అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారని, కానీ ఆ యత్నాన్ని బిజెపి సర్వేయర్లు వ్యతిరేకించారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శనివారం వెల్లడించారు. ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తూ, ‘అయోధ్యలో మేము బిజెపిని ఓడించినట్లుగా’ బిజెపి కంచుకోటలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రధాని మోడీ అయోధ్య నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని అభిలషించారు. కాని ఆయన ఓడిపోతారని, ఆయన రాజకీయ జీవితం ముగుస్తుందని ఆయన సర్వేయర్లు చెప్పారు’ అని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ తెలిపారు.

‘తనకు భగవంతునితో ప్రత్యక్ష అనుబంధం ఉందని మోడీ చెబుతారు. మరి లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలో బిజెపి ఎందుకు ఓడిపోయింది?’ అని రాహుల్ అన్నారు. తనకు దైవ కృప ఉందని ప్రధాని ఆమధ్య ఒక ఇంటర్వూలో చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని రాహుల్ అలా అన్నారు. అయోధ్య రామమందిర్ ఉన్నఫైజాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవధేశ్ ప్రసాద్ బిజెపి అభ్యర్థిని ఓడించారు. రామ్ లల్లా విగ్రహం ప్రాణ ప్రతిష్ఠాపన ఉత్సవానికి ప్రధాని మోడీ సారథ్యం వహించిన నాలుగు నెలలకే బిజెపికి ఓటమి ఎదురైంది. అయితే, ప్రధాని మోడీఈ వారణాసి నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ ఆయనకు ఆధిక్యం తగ్గింది. ఆ నియోజకవర్గంలో బిజెపి పరాజయానికి మూడు కారణాలను కూడా రాహుల్ ఉటంకించారు. రామ మందిరం నిర్మాణం కోసం సేకరించిన భూమికి తమకు పరిహారం అందనందుకు ప్రజలు బిజెపి ప్రభుత్వంపై ఆగ్రహం చెందారని ఆయన తెలిపారు. ‘ఇక రెండవ కారణం& రైతుల స్థలంలో అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం జరగడం. వారికి సరైన పరిహారం కూడా చెల్లించలేదు.

మూడవ కారణం& రామ మందిరం ప్రారంభోత్సవంలో అయోధ్య వాసులు ఒక్కరూ లేకపోయారు. ఇది వారిని ఆగ్రహానికి గురి చేసింది. అయోధ్యలో ఎన్‌డిఎ ఓటమికి, ఇండియా కూటమి విజయానికి ఇవే కారణాలు. అయోధ్య చుట్టూ ఎల్‌కె అద్వానీ ప్రారంభించిన ఉద్యమాన్ని బిజెపి దెబ్బ తీసింది’ అని రాహుల్ ఆరోపించారు. అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ కార్యాలయం వెలుపల బిజెపి. కాంగ్రెస్ కార్యకర్తల సంఘర్షణ జరిగిన కొన్ని రోజుల తరువాత గుజరాత్‌ను రాహుల్ సందర్శించారు. లోక్‌సభలో బిజెపి, హిందుత్వంపై రాహుల్ వ్యాఖ్యలకు నిరసన సూచకంగా మంగళవారం విహెచ్‌పి, బజరంగ్ దళ్ సభ్యులు రాజీవ్ గాంధీ భవన్‌లోకి ప్రవేశించి రాహుల్ పోస్టర్లపై నల్ల రంగు పూశారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తూ, తదుపరి గుజరాత్ ఎన్నికల్లో బిజెపి ఓటమికి సన్నద్ధం కావాలని కోరారు. ‘వారు (బిజెపి) ఇక్కడ మన కార్యాలయాన్ని ధ్వంసం చేసి, మన కార్యకర్తలపై దాడి జరిపారు& ఇప్పుడు మీరు ఎవ్వరికీ భయపడరాదు. వారు మన కార్యాలయాన్ని పాడు చేయడం ద్వారా మనకు సవాల్ విసిరారు. గుజరాత్‌లో వారిని ఓడించడమే సవాల్’ అని రాహుల్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News