Saturday, November 23, 2024

ఫైనాన్స్ సొమ్ము పక్కదారి…!

- Advertisement -
- Advertisement -

ఆర్థిక శాఖలో కోట్లు కొల్లగొడుతున్న అక్రమార్కులు..?
పీకల్లోతు నష్టాల్లోకి నెట్టేస్తున్న అవినీతి అధికారులు

మనతెలంగాణ/హైదరాబాద్:  ఫైనాన్స్ సోమ్మును కొందరు అధికారులు, ఉద్యోగులు అప్పనంగా దోచేస్తున్నారు. ఈ శాఖలో పనిచేస్తున్న కొందరు అధికారులు ప్రభుత్వ సొమ్మును అందినకాడికి దండుకొని ప్రభుత్వ ఖజానాకు భారీగా కోత పెడుతున్నారు. ఏజి ఆడిట్‌లోనూ తమ తప్పులను బయటపడకుండా అక్కడ పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులను ఔట్‌సోర్సింగ్ కింద ఆర్థికశాఖలో నియమించుకొని వారికి భారీ జీతాలు చెల్లిస్తూ ఆడిట్‌లో దొరకకుండా ఆడిట్ నుంచి వచ్చే వారిని మచ్చిక చేసుకొని తాము దుర్వినియోగం చేసిన నిధులు వివరాలు బయటపడకుండా కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారని ప్రభుత్వానికి ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే వారు తమ అవినీతి బయటపడకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వారిపై చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

కొందరు చేతుల్లోనే ఆ శాఖ…

ప్రస్తుతం ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వంలోని సిఎం, డిప్యూటీ సిఎం, మంత్రులు నానాతంటాలు పడుతుండడంతో పాటు ఎప్పటికప్పుడు వారి ఖర్చులను తగ్గించుకోవడానికి చూస్తున్నారు. కానీ, ఆర్థికశాఖలోని కొందరు అధికారులు మాత్రం రాష్ట్ర బడ్జెట్ వారి చేతిలో ఉండడం, తమను అడిగే వారు లేకపోవడంతో ఇష్టానుసారంగా ఆర్థికశాఖను పీకల్లోతు నష్టాల్లో ముంచుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత పదేళ్లుగా వారిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో పాటు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి సైతం వీరిపై ఫిర్యాదులు వెళ్లినా ఆ అధికారుల వైఖరిలో మార్పు రాకపోవడం విశేషం. ప్రస్తుతం ఫైనాన్స్‌కు సంబంధించిన అధికారం కొందరు అధికారుల చేతుల్లోనే నడుస్తుండడంతో వారు చెప్పిందే వేదంగా జరుగుతోంది.

నిజాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు ఒక అధికారిపై వేటు వేయాలని…

ఔట్‌సోర్సింగ్ కింద డిసెంబర్‌లో ఇద్దరు అధికారుల నియామకం జరగ్గా వారికి అడ్వాన్సుగా సంవత్సరం జీతం చెల్లించడం, రామన్నపేటకు సంబంధించిన ఒకే చెక్కుకు రెండుసార్లు చెల్లింపులు చేయడం, అర్హత లేని అధికారులకు వాహనంతో పాటు పెట్రోల్, డీజిల్, డ్రైవర్‌లను సమకూర్చడం లాంటివి కొందరు అవినీతి అధికారులకే చెల్లింది. ఇక స్థానిక ఎస్‌టిఓలకు అధికారం లేకుండా చేశారని, దీనికోసం ఐఎఫ్‌ఎంఐఎస్ కంపెనీతో కలిసి ఫిక్స్‌ఎల్ వైడ్ సాఫ్ట్‌వేర్ ద్వారా చెల్లింపులు చేస్తుండడం, దీనివల్ల అవకతవకలు జరుగుతున్నాయని ఒక యూనియన్ నాయకుడు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో ఆయనపై ప్రస్తుతం సస్పెన్షన్ వేయాలని ఆ శాఖకు చెందిన కొందరు ఉన్నతాధికారులు ఫైల్ పెట్టినట్టుగా తెలిసింది. ఇందులో భాగంగా ఆయన్ను తమదారికి తెచ్చుకోవడానికి బెదిరింపులకు సైతం పాల్పడుతున్నట్టుగా సమాచారం. చెప్పిన మాట వినకుంటే సస్పెన్షన్ చేస్తామని ఆ యూనియన్ నాయకుడితో ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నట్టుగా తెలిసింది.

అర్హత లేని ఎస్‌ఓ స్థాయి అధికారులకు వాహనాలు

ఇక అర్హత లేని ఎస్‌ఓ స్థాయి అధికారులకు వాహనాలను సమకూర్చి వారికి డ్రైవర్‌లను, పెట్రోలు కూడా అదనంగా ఇచ్చి ఫైనాన్స్ సొమ్మును అప్పనంగా ఖర్చు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారికి మాత్రమే వాహనం సమకూర్చాలన్న నిబంధన ఉన్నా కొందరు అధికారులు మాత్రం ఆ నిబంధనలను తుంగలో తొక్కి అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు కొందరు ఎస్‌ఓ స్థాయి అధికారులు తమ సొంత వాహనాలను ఆఫీసు కోసం వినియోగించుకొని వాటికి నెలవారి బిల్లులతో పాటు అదనంగా డ్రైవర్ అలవెన్స్, పెట్రోల్, డీజిల్‌ను కూడా వాడుకోవడం విశేషం. మాములుగా అసెంబ్లీ బడ్జెట్ సమయంలో మూడునెలల పాటు ఆర్థిక శాఖ అధికారులకు వాహనాలను సమకూర్చుతారు. అయితే కొందరు అధికారులు మాత్రం సంవత్సరం పాటు వాహనాల అద్దెతో పాటు డ్రైవర్ అలవెన్స్‌లు, పెట్రోల్, డీజిల్ పేరుతో కొన్ని సంవత్సరాలుగా కోట్లను కొల్లగోడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా కొందరు అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

బడ్జెట్ అనుమతులు లేకుండానే చెల్లింపులు…
ఐటీ శాఖ పరిధిలోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)లో కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన డైరెక్టర్ (ఐటీ పివి రమణారావు, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ ఎన్. కృష్ణారావులను 2023, డిసెంబర్ 18వ తేదీన ఈ శాఖలో నియమిస్తున్నట్టు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అంతర్గత ఉత్తర్వుల (ఓఓఆర్‌టి1467)ను జారీ చేశారు. ఆ ఉత్తర్వుల్లో పివి రమణారావుకు 2024 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు నెలకు రూ.2,50,000ల చొప్పున రూ.60 లక్షలను, ఎన్. కృష్ణారావుకు అదే రెండేళ్ల కాలా నికి నెలకు రూ.1,20,000ల చొప్పున మొత్తం రూ.28,80,000 చెల్లించడానికి అనుమతి ఇచ్చింది. దీంతో పాటు ఇద్దరికీ కలిపి 20 శాతం సిజీజీ అడ్మినిస్ట్రేటివ్ చార్జీల కింద రూ.17,78,000లు, 18 శాతం జీఎస్టీ కింద రూ.19,18,008లను కూడా చెల్లించాలని ఆదేశించింది. ఇలా మొత్తం కలిపి రూ.1,25,74,080 చెల్లించడానికి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

ఒకే బిల్లుకు రెండుసార్లు చెల్లింపులు….

దీంతోపాటు తాజాగా యాదాద్రి జిల్లా రామన్నపేట ఎస్టీఓ పరిధిలో ఓ కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన సుమారు రూ.30,65,987లను స్థానిక ఎస్టీఓ అధికారులు (2023 నవంబర్, 22వ తేదీన టోకెన్ నెంబర్ 2438538332) క్లియర్ చేయగా, అదే చెక్‌ను స్థానిక అధికారులకు తెలియ కుండా ఈ కుబేర్ నుంచి రాష్ట్ర ఫైనాన్స్ నుంచి మరోసారి (ఏప్రిల్ 30వ తేదీన 251940047 టోకెన్ ఆధారంగా) చెల్లింపులు చేశారు. ఈ విషయమై రామన్నపేట ఎస్టీఓ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News