Friday, December 20, 2024

త్వరలో స్మార్ట్ రేషన్ కార్డులు

- Advertisement -
- Advertisement -

ప్రస్తుత రేషన్ కార్డుల్లో సవరణలకు అవకాశం
రేషన్‌కార్డు, ఆధార్ కార్డుతో అనుసంధానం
పాత రేషన్ కార్డుకు సమూల మార్పులు
రెండు నెలల్లో తేవాలని కాంగ్రెస్ సర్కార్ యోచన

మన తెలంగాణ/హైదరాబాద్‌ః సాధారణ ప్రజానీకం నుంచి ఉన్నత శ్రేణి వర్గం వరకు నిత్యం అవసరమైన డాక్యుమెంట్లలో రేషన్ కార్డు ఒకటి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ నోట విన్నా రేషన్ కార్డు మాటే. తెలంగాణ రాష్ట్రంలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. కొత్తగా రేషన్ కార్డు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వారు కొందరైతే, ఉన్న రేషన్ కార్డులో తమ కుటుంబీకుల పేర్లు ఆ కార్డులో జత చేయాలని, అడ్రస్ మార్పు, తదితర సమస్యలు పరిష్కరించుకునేందుకు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ప్రజలు ఆశించినంత వేగంగా రేషన్ కార్డుల జారీ, నిబంధనలు, రేషన్ కార్డు అప్‌డేట్ వంటి పనులన్నీ జరగడం లేదు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రేషన్ కార్డుల జారీ గురించి ఏదో ఒకటి చెబుతూనే ఉంది. ప్రస్తుతం ఆధార్ కార్డు, పాన్ కార్డు మాదిరిగానే రేషన్ కార్డు కూడా ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటిగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ సంక్షేమ పథకాలు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో అసలు రేషన్ కార్డు స్వరూపాన్నే మార్చి వేసి వాటి స్థానంలో కొత్తగా కంప్యూటరైజ్డ్ స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. అవకతవకలు లేకుండా, అవినీతికి అవకాశం లేకుండా స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. అయితే దీనికి ముందు ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్న వారికి ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ, కొత్త రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డుల ప్రక్రియను ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నాటికి తీసుకురావాలని భావిస్తోంది. ఇప్పటికే లక్షలాది దరఖాస్తులు కొత్త రేషన్ కార్డుల కోసం పెండింగ్‌లో ఉన్నాయి. కాగా రేషన్ కార్డు వల్ల ఉపయోగాలు ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరు తమ రేషన్ కార్డును భద్రపర్చుకోవాలని, వాటిని అప్‌డేట్ చేయించుకోవాలని చూస్తున్నారు.

ముఖ్యంగా తక్కువ ధరకే రేషన్ దుకాణం నుంచి నిత్యావసర సరుకులు తీసుకునేందుకు, అడ్రస్ ఫ్రూఫ్‌గా కూడా రేషన్ కార్డు పని చేస్తుంది. తెలంగాణలో గత కొంతకాలంగా కొత్త రేషన్ కార్డులు జారీ లేకపోవడంతో రేషన్ కార్డులు లేనివారు పలు విధాలుగా నష్టపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాల్లో లబ్ధి పొందాలంటే రేషన్ కార్డు ఉండి, దానిలో పేరు తప్పనిసరిగా ఉండాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులో సవరణల కోసం ఓ సువర్ణ అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం ఉన్న కార్డులో కొత్తగా ఎవరినైనా యాడ్ చేసుకోవడానికి కూడా వీలు కల్పిస్తోంది. రేషన్ కార్డులో వివరాలు తప్పుగా ఉన్నా, రేషన్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలని భావించినా వాటిని అప్‌డేట్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ముఖ్యంగా చాలా మంది తల్లిదండ్రులు తమ కార్డులో పిల్లల పేర్లు కలుపుకోవాలని ఎదురుచూస్తున్నారు. అలాగే రేషన్ కార్డులో కొత్తగా పెళ్లైన కొడుకు పేరు ఉండి కోడలి పేరు లేని వారు చాలా మందే ఉన్నారు. ఇటువంటి వారి కోసం తెలంగాణ సర్కార్ అద్భుత అవకాశం కల్పిస్తోంది. అందుకోసం అప్లికేషన్స్ స్వీకరిస్తుంది.

రేషన్ కార్డులో ఇలా సవరణ చేసుకోవచ్చు

రేషన్ కార్డులో తప్పుల సవరణకు ఎక్కడికో వెళ్లే అవసరం లేకుండా ఎవరికి వారు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వీలు కల్పించింది. రేషన్ కార్డు సవరణ, కొత్తగా పేరు చేర్చుకునేందుకు మొబైల్ ఫోన్లోనే ఇప్పుడే చేసుకునేందుకు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మీరు ముందుగా తెలంగాణ మీ సేవ పోర్టల్‌ను సందర్శించాలి. ఆ తర్వాత హోమ్ పేజీలో కనిపించే సర్వీసెస్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అప్పుడు ఓపెన్ అయిన పేజీలో సెర్చ్ ఫర్ సర్వీసెస్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత డిపార్టుమెంట్ అనే ఆప్షన్‌లోకి వెళ్లి సెలెక్ట్‌పై క్లిక్ చేసి సివిల్ సప్లయిస్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం ఓపెన్ అయిన పేజీలో కరక్షన్స్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు అనే ఆప్షన్ కనిపిస్తుంది.

దానిపై క్లిక్ చేస్తే నెక్ట్ వచ్చే పేజీలో కుడిపక్కగా డౌన్‌లోడ్ అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఆ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫామ్‌లో చిరునామా మార్పు, సభ్యుల వివరాల్లో సవరణ, కొత్త వారి చేరిక అనే ఆప్షన్లు ఉంటాయి. వాటిలో ఏది అవసరమైతే అది టిక్ చేసి, మిగిలిన దరఖాస్తు ఫామ్ అంతా పూర్తి చేసి దానితో పాటు అవసరమైన ధృవీకరణ పత్రాలు జత చేసి దగ్గరలోని మీసేవా కేంద్రంలో సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత ఈ దరఖాస్తు మేరకు అధికారులు ఇంటికి వచ్చి విచారించిన అనంతరం రేషన్ కార్డులో కోరుకున్న మార్పులు చేర్పులు పూర్తవుతాయని అధికార వర్గాల సమాచారం. దరఖాస్తు ఫాంతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మిగిలిన పేర్కొన్న డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది.

త్వరలో స్మార్ట్ కార్డ్ తరహాలో కొత్త రేషన్ కార్డులు

సాధారణ పేపర్లతో కూడిన రేషన్ కార్డుల స్థానే చిప్‌లతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా కసరత్తు చేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానంతో ఈ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టడం ద్వారా కొత్త విధానానికి నాంది పలకాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. రేషన్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం కూడా వాటితో పాటు పూర్తి చేయాలని భావిస్తోంది. తెలంగాణ స్టేట్ కోడ్‌ను టీఎస్ నుంచి టీజీగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆహార భద్రత కార్డుల డిజైన్ కూడా సమగ్రంగా మార్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పాత రేషన్ కార్డుల స్థానంలో ‘టీజీ’ ప్రింట్‌తో కొత్తగా స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు కసరత్తు చేపట్టిందని సమాచారం. కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు సరికొత్తగా బార్ కోడ్, సులభంగా యాక్సెస్ చేసేలా రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొత్త కార్డు స్వరూపంపై అధికారులు సాంకేతిక నిపుణులతో చర్చలు జరిపారని చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు నెలలు పూర్తయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటి పరిశీలన కూడా పూర్తి చేశారు. ఎన్నికల కోడ్ గడువు పూర్తి కాగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని భావించింది. ఇటీవల ఆరోగ్యశ్రీ కార్డు పరిమితిని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షలకు ప్రభుత్వం పెంచింది. దీంతో పాత ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో కొత్తవి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. కొత్తగా మంజూరు చేసే రేషన్ కార్డు రూపం పూర్తిగా మార్చాలనే ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. కొత్త కార్డులో ఎలాంటి వివరాలు పొందుపరచాలి అనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్మార్ట్ రేషన్ కార్డుపై బార్ కోడ్ ద్వారా రేషన్ సరుకు పక్కదారి పట్టకుండా నేరుగా లబ్దిదారుడికే చెందేలా కసరత్తు జరుగుతోంది.

ఒకవేళ ఒకనెల రేషన్ తీసుకోకున్నా మరుసటి నెల రెండు నెలల రేషన్ కలిపి తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే జరిగితే సామాన్యులు రేషన్ సరుకుల కోసం దిగులు చెందాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక చిన్న పుస్తకం తరహాలో రేషన్ కార్డులు ఉండేవి. కుటుంబ యాజమాని పేరుపై కార్డు జారీ చేశారు. కార్డులో కుటుంబ సభ్యుల ఫొటో, పూర్తి వివరాలు ఉండేవి. ఆ తర్వాత వీటిస్థానంలో రైతు బంధు పాస్‌బుక్ సైజ్‌లో రేషన్ కార్డులు అందించారు. ఈ కార్డుల్లో ముందువైపు కుటుంబ సభ్యుల ఫొటో, కుటుంబ సభ్యుల వివరాలు ఉండేవి. వెనుక భాగంలో చిరునామా, ఇతర వివరాలు ఉండేవి. అయితే అనంతరం ఆ తర్వాత రేషన్ కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులు జారీ చేశారు. సింగిల్ కార్డులో యజమాని, కుటుంబ సభ్యుల ఫొటో లేకుండా ముద్రించారు.

కార్డుదారు, కుటుంబ సభ్యులు, రేషన్ షాపు వివరాలు మాత్రమే కార్డులో ఉండేవి. ఇప్పుడు వీటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్డులు జారీ చేయనుంది. వాస్తవానికి జూన్ 4 తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని సర్కార్ భావించింది. కానీ శాఖాపరమైన కారణాల వల్ల జాప్యం జరిగింది. త్వరలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత పది ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు జారీ కాలేదు. ఎన్నికల కోడ్ ముగిశాక అర్హులను ఎంపిక చేస్తామని కొత్త ప్రభుత్వం ప్రకటించడంతో కొత్త రేషన్ కార్డులకు లక్షలాది మంది దరఖాస్తు చేసుకుని నిరీక్షిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News