Sunday, October 6, 2024

విస్మృత కులాల విలువైన కథలు

- Advertisement -
- Advertisement -

వ్యవసాయానికి అనుబంధంగా సాగిన వృత్తుల్లో గొర్లకాపరి వృత్తి ఒకటి. గొల్లలు, కుర్మలు గొర్ల కాపరులు. కుర్మలు గొర్రెల బొచ్చు కత్తిరించి, దాన్ని వడికి దారం తీసి, రాట్నం మీద కండెలు చుట్టి, మగ్గం మీద చింత అంబలి రాసి, గొంగళ్ళు నేస్తారు. ఈ గొంగడి ఎండకు చల్లదనాన్ని, చలికి వెచ్చదనాన్ని, వర్షానికి కొప్పెర పెట్టుకుంటే గొడుగు మాదిరిగా శరీరం మీద చినుకు పడనీయదు. డక్కనీ (దేశివాళి నల్ల గొర్రె) బొచ్చు నుండి మాత్రమే తెలంగాణలో గొంగళ్ళు తయారుచేస్తారు. ఈ మధ్యన వచ్చిన సంకర జాతి గొర్ల్రైన నెల్లూరు బ్రౌన్, వైట్, జుడిపి రకాలను కేవలం మాంసం కోసమే పెంచుతారు. వీటికి బొచ్చు ఉండదు. ఒకే వృత్తి చేసినా గొల్ల, కుర్మల మధ్యన సామాజిక అంతరాలు పాటిస్తారు.

అంతర వివాహాలు (Endogamy) ఉంటుంది. గొల్లలు, కుర్మలను తక్కువగా చూస్తారు. కుర్మలు మల్లన్న దేవుని పట్నాలు వేసి, కథలు చెప్పుతారు. వీటినే ఒగ్గు కథలు అంటారు. “గొంగడి” గొర్ల కాపరుల కథల సంపుటిలో (18) కథలు ఉన్నాయి. దీనిలో కొందరు రచయితలు ఇన్ సైడర్‌గా రాసిన కథలు, అవుట్ సైడర్‌గా రాసిన కథలు ఉన్నాయి. లబ్దప్రతిష్ఠులైన బండి నారాయణస్వామి నుండి మొదటి కథ రాసిన తగుళ్ళ గోపాల్ కథ వరకు ఈ సంపుటిలో ఎంపిక చేసిన కథలు ఉన్నాయి. వస్తుపరంగా చూసినపుడు కుర్మల సంస్కృతి, గొర్లకు మేత దొరకని స్థితిలో మన్నెం (వలస) పోవడం, వృత్తి మార్పు, జంగ్లాత్, దొరల ఆగడాలు, బేరగాళ్ళ మోసాలు, సాధారణ మానవ సంబంధాలను చిత్రించిన కథలు ఈ సంపుటిలో ఉన్నాయి.
మన దేశ సంస్కృతి రెండు రకాలు. మార్గ సంస్కృతి, దేశీ సంస్కృతి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలు ఆచరించే వైదిక సంస్కృతి మార్గ సంస్కృతి. శూద్రులది, అతిశూద్రులది దేశీ సంస్కృతి.

సంస్కృతి నిలువ నీరు లాగా ఉండదు. అది ప్రవాహశీలమైంది. ఒకదాని ప్రభావం మరొకదాని మీద పడుతుంది. ఆదాన ప్రదానం ఉంటుంది. బండి నారాయణస్వామి “అవశేషం” కథ కుర్మల సంస్కృతిని, దానిలో వచ్చిన మార్పులను చిత్రించింది. కుర్మల పూజారి కాళ్ళకు చెప్పులు వేసుకోకూడదు. బీడి కాల్చకూడదు. మద్యం ముట్టరాదు. మాంసం తినరాదు. ఆవుపాలు తప్ప ఎనుము పాలు తాగకూడదు.“పూర్వం తమ పంటలోని అన్ని దినుసులు పూజారి ఇంటికి ఇచ్చేవారు”. “ఉత్పత్తి చేసిన వస్తువులను డబ్బుల్లోకి మార్చుకోవడం” ప్రారంభమైన తర్వాత ఆయనకు ఉచితంగా ఎవ్వరు ఏది ఇవ్వలేదు. పెట్టుబడిదారి పూర్వ గాథలోని వ్యవసాయంలో పంటలు కేవలం వినియోగానికి మాత్రమే పండించే వారు. పెట్టుబడిదారి విధానం ప్రవేశించిన తర్వాత పంటలు వినియోగంతో పాటు, మార్కెట్‌లో అమ్ముకోవడానికి పండిస్తున్నారు. ప్రతి వస్తువు మారకం విలువ తెలిసినంక ఇక ఉచితంగా ఇయ్యడం మానుకున్నరు.“డబ్బు సంపాదించి పెట్టే వివిధ మార్గాల్లోకి చొచ్చుకుపోయి నాగరికులు” అయిపోయినంక కుర్మల ఆచారాల్లో మార్పులు వచ్చినాయి. భర్త చనిపోయిన స్త్రీని చిన్నచూపు చూడటం మొదలైంది. ఇది వరకు ఏడు మనువులు పోయిన స్త్రీని గౌరవంగా చూసేవారు.

ఇప్పుడు చులకనగా చూస్తున్నారు. “రెక్కాడితే కాని డొక్కాడని” జెల్లి మల్లయ్య కొడుకును పూజారిగా మార్చడానికి ఒప్పుకోలేదు. కాని పూజారి పేరు మీద ఐదు ఎకరాల భూమి ఇయ్యడానికి సిద్ధమైనపుడు, ఆయన కొడుకును పూజారిగా నియమించడానికి ఒప్పుకున్నాడు. దీన్ని ఆర్థిక కోణంలో చూసినాడు రచయిత. ఒకప్పుడు కులాచారం ఒప్పుకోదు అని రవికెలు వేసుకోవడానికి నిరాకరించిన కురుమ స్త్రీలు ఇప్పుడు పట్టుచీరలు కట్టుకుంటున్నారు. ఇది కూడా ఆర్థికంగా స్థితిమంతులు అయిన తర్వాత వచ్చిన మార్పు. ప్రధాన స్రవంతి సంస్కృతి అనుకరణ. కుల సంకరాన్ని వ్యతిరేకించిన వారు ఇప్పుడు అక్కడక్కడ కులాంతర వివాహాలు చేసుకొంటున్నారు. “అవశేషం” కథ పాత సంస్కృతిలోని కొన్ని అంశాలు లుప్తమై పోవటం, కొత్తవి వచ్చి చేరటం, అవి కూడా ఆర్థిక ప్రయోజనాలకు, ఎదుగుదలకు సంబంధించినవి కావడం విశేషం.డా. వి.ఆర్. రాసాని “మల్లేశు కుక్క” కథ గొరవ దీక్ష (శివదీక్ష)కు సంబంధించింది. ఇంటిలో పెద్దకొడుకుకు శివదీక్ష ఇప్పించడం కురవల (కుర్మల) కులాచారం. ఆ దీక్ష ఇంటిలోని పెద్దకొడుకు తీసుకోకుంటే వంశం నిర్వంశం అవుతుందని వాళ్ళ విశ్వాసం. తల్లిదండ్రి ఒత్తిడి చేయడం వలన వెంకట మల్లయ్య దీక్ష తీసుకున్నాడు. ప్రతి ఆచారానికి ఒక ఐతిహ్యం ఉన్నట్టే ఈ దీక్షకు కూడ ఉంది. పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన విషం శివుడు తాగినాడు. ఆ విషం తాగినవారు ఒక రేయి, ఒక పగలు నిద్రపోకూడదు. శివుడు నిద్రపోకుండా చూడడానికి పార్వతి గొరవయ్యగా మారింది. గొంగడి గౌను, పిల్లనగ్రోవి ఒక చేతిలో, ఒగ్గు ఒక చేతిలో, ఎలుగుబంటి చర్మం టోపి, కపాలంలో పాలు ఇది వేషధారణ. పార్వతి, శివుడు నిద్రపోకుండా కాపాడింది. తర్వాత పసుపుతోని బొమ్మను చేసి దానికి ప్రాణం పోసి గొరవయ్యను చేసిందని కుర్మల నమ్మకం. గొరవ దీక్షను తీసుకున్నవారు ఆ దీక్షను తీసుకున్న ఆడపిల్లనే పెండ్లి చేసుకోవాలి.

శివరాత్రికి నాలుగు నెలల ముందు నుండే దీక్ష ప్రారంభమవుతుంది. శివ లీలలను పాటలుగా పాడుతూ, ఢమరుకం వాయిస్తూ, భోజ (పాత్ర)లో జనం ఇచ్చిన భిక్షను స్వీకరించి, కపిరి (అర్థ కపాలం ఆకారం పాత్ర)లో పాలు పోసుకొని కుక్కలాగ గతుకుతరు. ఈ విధంగా ఊరూరు తిరుగుతూ భిక్షాటన చేస్తూ, శివరాత్రి రోజు రాత్రి మల్లన్న కొండకు చేరుకొని ఆటపాటలతోని జాగారణ చేసి, శివదర్శనం చేసుకొని శివయాత్ర దీక్షను విరమిస్తారు. మల్లన్న పూజార్లుగా కుర్మలే ఉండేది. గుడి బాగా అభివృద్ధి చేసిన తర్వాత అది దేవాదాయ శాఖ ఆధీనంలోకి పోయింది. శూద్రులు పూజారులు ఏందని బ్రాహ్మణులను పూజారులుగా పెట్టినారు.దీక్ష తీసుకున్న వాళ్ళకు ఒక గుర్తింపు బిల్ల, సంవత్సరానికి ఒక వెయ్యి రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నారు. ఇట్లా అభివృద్ధి చెందిన గుడి బ్రాహ్మణుల చేతిలోకి పోయినంక గర్భగుడిలో అడుగు పెట్టనీయరు. చిల్ల మల్లేశం “ఒగ్గు కథ” కుర్మల కళారూపం. మల్లన్న దేవుని పట్నాలు వేసి కథలు చెప్పుతారు. ఈ కథలను ఒగ్గు కథలు అంటారు.

ఈ కథలో మిద్దెరాములు కథ చెప్పినట్టు చిత్రితమైంది. ఈయన గొల్ల, కుర్మ కాదు, గౌడ కులస్తుడు. ఈ కళ మీద అభిమానంతోని నేర్చుకున్నడు. శిఖరాయ మౌనంగా ఎదిగిండు. ఏ పౌరాణిక కథ అయినా దానిలోని పాత్రల మీద మానవ స్వభావాన్ని ఆరోపిస్తారు. కష్టాలు, సుఖాలు, కోపాలు, తాపాలు ఆ పాత్రలకు ఉంటాయి. మంచితనంతోనే పురాణాలలోని పురుష, స్త్రీలు గొప్పవారైనారని “మంచోళ్ళకు ఎప్పటికైనా మంచే జరుగుతుందని” తీర్మానిస్తాడు రచయిత ఈ కథలో. ఎవరి మంచి ఎవరికి చెడు అన్న దానిలో భిన్నమైన వాదనలు ఉన్నాయి. ఈ రచయిత నిజమైన ఒగ్గు కళాకారుల మల్లన్న పట్నాలను కథా వస్తువుగా తీసుకొని ఉంటే కథ బలంగా ఉండేది. నందిని సిధారెడ్డి “పుల్లర” కథ అడవి అధికారుల దోపిడీ, దౌర్జన్యాలను చిత్రించింది. గొర్రె ఒక్కంటికి పన్నెండు రూపాయలు పుల్లర వసూలు చేసి రెండు రూపాయలు మాత్రమే ప్రభుత్వానికి చెల్లించి మిగిలిన పది రూపాయలను అటవీ అధికారులు జేబులో వేసుకొంటున్నారు. నాలుగు రూపాయల పుల్లర కట్టడానికి గొర్ల కాపరులు ఒప్పుకున్నారు. కాని అధికారులు పన్నెండు రూపాయలు కట్టమని డిమాండ్ చేసినారు. పది మేకలు, ఎనిమిది గొర్రెలు జీబులో వేసుకొని పోతుంటే సామూహికంగా ఎదుర్కొని జీవాలను విడిపించుకున్నారు. ఈ సామూహిక చైతన్యం అన్నలు ప్రోది చేసింది. బోయ జంగయ్య “తోడేళ్ళు” కథ విసునూరు రామచంద్రారెడ్డి కొడుకు బాబు దొర మల్లయ్య గొర్లమంద మీద దాడి చేసి, మల్లయ్యను, కుక్కను చంపి, పది గొర్రెలను ఎత్తుకపోయిన సంఘటనను చిత్రించింది.

బిడ్డ పెండ్లికి అయిన అప్పు తీర్చడానికి గొర్లను అమ్ముతానన్న మల్లయ్య ఆశలు నెరవేరలేదు. ఇది నిజాం కాలం నాటి దొరల దౌర్జన్యానికి ఒక మచ్చుతునక. కుక్క గొర్ల కాపరికి ఒక రక్షణ కవచం. కుక్క మందకు కాపల. అది తోడేలు లాంటి క్రూర జంతువుల ఉనికిని పసిగట్టి కాపరిని అలర్ట్ చేస్తుంది. భూపాల్ రాసిన “సేవకుడు” కథ ఈ విషయాన్నే వివరిస్తుంది. గొర్ల కాపరి కొమురయ్య కుక్క ముద్దుపేరు మల్లేశ. గొంగడి, చేతికర్ర, గొడ్డలి చిప్పకొమురయ్య ఆయుధాలైతే, మల్లేశ (కుక్క) గొర్లమందకు పాయిలెట్ డ్యూటీ చేస్తది. మంద మీదికి వచ్చిన మూడు తోడేళ్ళను తరిమింది మల్లేశ. మరొక తోడేలును గాయపరిచింది. తోడేలు కుక్క తొడ కొరికి గాయపరిచినా అది రాత్రంతా మంద చుట్టూ తిరుగుతూ, మొరుగుతూ కాపల కాసింది. కొమురయ్య అనారోగ్యానికి గురి అయి పడిపోయినపుడు అది మొరిగి ఆయన తోటి కాపరులకు ఆయన అనారోగ్యం గురించి తెలిపి ఆయనకు సేవలు చేసే విధంగా చేసింది.

కందుకూరి అంజయ్య
9490222201

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News