ఇస్కాన్ సంస్థ ఒక మంచి
కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది
సర్వమతాలకు స్వేచ్ఛ, అవకాశాలను
కల్పిస్తుంది మానవ సేవే మాధవ
సేవ అన్న సందేశం అందరికీ
చేరేలా ప్రభుత్వం కృషి జగన్నాథ
రథయాత్ర ప్రారంభోత్సవంలో
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జరిగే జగన్నాథ రథయాత్రను సిఎం రేవంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు ఈ రథయాత్ర కొనసాగింది. జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సిఎం ఈ రథయాత్రను ప్రారంభించారు. అనంతరం సిఎం మాట్లాడుతూ జగన్నాథ రథయాత్రను నిర్వహించటంలో భాగస్వామ్యం కావడం ప్రభుత్వ బాధ్యత అని, ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు మంచి అనుభూతిని కలిగిస్తుందని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇస్కాన్ సంస్థ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని, ఈ ప్రభుత్వం అందరిదని, సర్వమతాలకు స్వేచ్ఛ, అవకాశాలను ఇస్తుందన్నారు. తమ ప్రభుత్వం మత సామరస్యాన్ని పాటిస్తుందని, ఇస్కాన్ సంస్థ ప్రార్ధనలతో రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అన్న సందేశం అందరికీ చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రథయాత్ర జరిగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.