Monday, December 23, 2024

వైఎస్‌ఆర్ యాత్ర స్ఫూర్తితోనే భారత్ జోడో యాత్ర చేశా: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

వైఎస్‌ఆర్ ప్లాన్లు కొన్నిటిని నా యాత్రలో భాగం చేశాం
వైఎస్ రాజశేఖరరెడ్డికి రాహుల్ గాంధీ నివాళి
2003లో ఎపి వ్యాప్తంగా పాదయాత్ర చేసిన వైఎస్‌ఆర్

న్యూఢిల్లీ : కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు తన ‘భారత్ జోడో యాత్ర’కు పార్టీ వెటరన్ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2003లో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా జరిపిన పాదయాత్రే ప్రేరణ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సోమవారం వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ 75వ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ ఒక వీడియో సందేశం విడుదల చేస్తూ, ఆయన సిసలైన ప్రజా నాయకుడు అని, ఆయన పట్టుదల, అంకితభావం, రాష్ట్ర, భారత ప్రజల అభ్యున్నతికి, సాధికారత పట్ల నిబద్ధత అనేక మందికి దారి చూపిన కిరణం అని పేర్కొన్నారు.

‘నేను వ్యక్తిగతంగా రాజశేఖరరెడ్డీజీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాలినడక అయిన నా ‘భారత్ జోడో యాత్ర’కు ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా రాజశేఖరరెడ్జీ సాగించిన యాత్రే స్ఫూర్తి. రాజశేఖరరెడ్డీజీ ఎండలో, వానలో, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలతో కలసి నడిచిన దృశ్యాలు నాకు గుర్తే’ అని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ తెలిపారు. ‘ఆ ఆలోచనలు కొన్నిటిని మేము తీసుకుని మా భారత్ జోడో యాత్రలో మిళితం చేశాం’ అని రాహుల్ తెలియజేశారు.

రాహుల్ 2022 సెప్టెంబర్ నుంచి 2023 జనవరి వరకు 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా నాలుగు వేల కిలో మీటర్ల మేర భారత్ జోడో యాత్ర సాగించిన విషయం విదితమే. వైఎస్‌ఆర్ 2003లో ఆంధ్ర ప్రదేశ్‌లో 1400 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టిడిపిని ఓడించి ఆయన 2004లో కాంగ్రెస్‌కు అఖండ విజయం చేకూర్చారు. రాజశేఖరరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కోసం జీవించిన వ్యక్తి అని రాహుల్ కొనియాడారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా ఆయనను కొనియాడారు. ‘దూరదృష్టి గల నేత రాజశేఖరరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ సంక్షేమం, అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేశారు’ అని ఖర్డే పేర్కొన్నారు,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News