Monday, January 20, 2025

ధన్వంతరి దగా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగరంలో మరో భారీ మోసం బయటపడింది, పెట్టుబడి పేరుతో వందల కోట్లు వసూలు చేసి నిండాముంచారు నిందితులు. గతంలో కూడా హైదరాబాద్‌కు చెందిన పలువురు బాధితులు అధిక వడ్డీకి ఆశపడి పలు సం స్థల్లో లక్షలాది రూపాయలు డిపాజిట్ చేసి మోసపోయారు. ఇలాంటి కేసులు వరుసగా బయటపడుతున్న క్రమంలోనే మరో సంస్థ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్‌గా చేసుకుని భారీ మోసానికి తెరతీశారు. బాధితుల వద్ద భారీగా డబ్బులు వసూలు చేసి నిండా ముంచారు. నిందితులు 4 వేల మంది నుంచి రూ. 514 కోట్లు వసూలు చేసి మోసం చేశారు. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ పి. కమలాకర్ శర్మ ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ పేరుతో పలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. కేవలం ఓ సామాజిక వర్గాన్ని, వృద్ధులను టార్గెట్‌గా చేసుకున్న నిందితుడు తన ట్రస్ట్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని, ప్లాట్లు ఇస్తామని చెప్పాడు. ఇది నమ్మిన బాధితులు తమ సామాజిక వర్గానికే చెందిన వారు నిర్వాహకులుగా ఉండడంతో భారీ ఎత్తున డబ్బులు డిపాజిట్ చేశారు. ఇలా 4 వేల మంది బాధితులు నిందితుడి ట్రస్ట్‌లో రూ. 514 కోట్లు డిపాజిట్ చేశారు.

ఇలా బాధితుల వద్ద నుంచి 514 కోట్ల రూపాయలు వసూలు చేసిన నిందితుడు పలు చోట్ల ఆస్తులు కొనుగోలు చేశాడు. గడువు ముగిసినా కూడా నిందితుడు బాధితులకు డబ్బులు ఇవ్వకపోవడంతో సూసర్ల నర్సింహ్మమూర్తి అనే వ్యక్తి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎసిపి ఆదినారాయణ ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు. నిందితుడు బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బులతో పలు ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఆస్తులకు సంబంధించిన వివరాలు సేకరించిన పోలీసులు అంబర్‌పేటలోని డిఎప్‌ఐ ఆస్పత్రి భూమి, అనకాపల్లి, వైజాగ్, గన్నవరం, విజయవాడ, సిద్దిపేట, మిడ్జెల్‌లోని 450 ఎకరల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లోని 3 వేల గజాల కమర్షియల్ ప్లాట్‌ను పోలీసులు సిసిఎస్‌కు అటాచ్డ్ చేశారు. నిందితుడికి సంబంధించిన 30 బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. నిందితుడి బ్యాంక్ ఖాతాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే సిసిఎస్‌కు వచ్చిన 200 మంది బాధితులకు కేసు దర్యాప్తు పురోగతి గురించి పోలీసులు వివరించారు.

ఆస్తులు అమ్మి బాధితులకు ఇస్తాం:
సిసిఎస్ డిసిపి శ్వేతారెడ్డి
ధన్వంతరి ఫౌండేషన్ పేరుతో కమలాకర్ శర్మ భారీ ఎత్తున డిపాజిట్లు సేకరించాడని సిసిఎస్ డిసిపి శ్వేతారెడ్డి తెలిపారు. ఇప్పటికే కమలాకర్ శర్మను అరెస్టు చేశామని, అతడి పేరుపై ఉన్న ఆస్తులను సిసిఎస్‌కు అటాచ్ చేశామని, రెండు ఆస్తులను అటాచ్డ్ చేసే విషయం ప్రాసెస్‌లో ఉందని తెలిపారు. ఇప్పటికే కేసు విచారణ పూర్తి చేశామని తెలిపారు. కోర్టు నుంచి అనుమతి వచ్చిన తర్వాత సీజ్ చేసిన ఆస్తులను విక్రయించి డిపాజిట్లు చేసిన బాధితులకు డబ్బులు వచ్చే విధంగా చూస్తామని తెలిపారు. విచారణ చేసే అధికారి బాధితులకు అందుబాటులో ఉంటారని, ఎప్పుడైనా బాధితులు వచ్చి కలవచ్చని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News