మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై జిల్లా పరిధిలోని ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలను సిఎం రేవంత్ ప్రారంభించనున్నారు. సిఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి 12.45 గంటలకు మహబూబ్ నగర్ చేరుకుంటారు. అక్కడ వనమహోత్సవంలో భాగంగా ఐడిఓసి వద్ద ప్లాంటేషన్ కార్యక్రమం అనంతరం ఉమ్మడి జిల్లా నేతలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
అనంతరం 1.00 గంటలకు మహిళ శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ధి పనులకు సిఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత 1.15 గంటల నుంచి 4.45 గంటల వరకు మహబూబ్ నగర్‌లోని ఐడిఓసిలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సిఎం సమీక్ష నిర్వహించనున్నారు. దీని తర్వాత 5 గంటల నుంచి 5.45 వరకు భూత్‌పూర్ రోడ్డులోని ఏఎస్‌ఎన్ కన్వేన్షన్ హాల్ లో పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులతో సిఎం సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం 6 గంటలకు సిఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.