Saturday, January 11, 2025

అమెరికాలో నలుగురు తెలుగువారు అరెస్టు

- Advertisement -
- Advertisement -

హూస్టన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఒక ఇంట్లో మానవ అక్రమ రవాణా రాకెట్‌ను నడుపుతున్న ఒక మహిళతోసహా నలుగురు భారతీయ-అమెరికన్లను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఇంట్లో అక్రమంగా భారత్ నుంచి రవాణా చేసినట్లుగా అనుమానిస్తున్న 15 మంది మహిళలు లభించినట్లు ప్రిన్స్‌టన్ పోలీసు శాఖ తమ దర్యాప్తు వివరాలను వెల్లడించింది. మార్చిలో అరెస్టు చేసిన చందన్ దాసిరెడ్డి(24), ద్వారకా గుండా(31), సంతోష్ కట్కూరి(31), అనీల్ మాలె(37)పై మానవ అక్రమ రవాణాకు పాల్పడినట్లు తాజాగా అభియోగాలను పోలీసులు నమోదు చేశారు. త్వరలో మరికొన్ని అరెస్టులు జరగనున్నట్లు పోలీసులను ఉటంకిస్తూ ఫాక్స్4న్యూస్ పోర్టల్ సోమవారం రాత్రి తెలిపింది.

ఒకే ఇంట్లో ప్రిన్స్‌టన్ లోని కొల్లిన్ కౌంటీలోగల గిన్స్‌బోర్గ్ లేన్‌లోని ఒక ఇంట్లో నేల మీదనే బలవంతంగా నిద్రిస్తున్న 15 మంది యువతులను పోలీసులు కనుగొన్నారు. ఆ ఇంట్లో ఫర్నీచర్ ఏదీ లేదని, కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు తదితర ఎలెక్ట్రానిక్ వస్తువులతో.పాటు దుప్పట్లు మాత్రం ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఒక పెస్ట్(చెదలు) కంట్రోల్ కంపెనీ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆ ఇంటిపై పోలీసులు దాడి జరిపి సోదాలు చేయడంతో ఈ మానవ అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది.

పెస్ట్ కంట్రోల్ కంపెనీకి చెందిన ఒక ఇన్‌స్పెక్టర్ ఆ ఇంటికి వెళ్లగా ఒక్కో రూములో ముగ్గురు నుంచి ఐదుమంది మహిళలు నేలమీద పడుకుని నిద్రించడాన్ని చూశారు. పెద్ద సంఖ్యలో సూట్‌కేసులు ఉండడాన్ని కూడా ఆయన గమనించారు. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందచేశారు. మార్చి 13న ప్రిన్స్‌టన్ పోలీసు శాఖ తన అధికారులను సంతోష్ కట్కూరీ ఇంటికి వారెంట్‌తోసహా వెళ్లారు. ఆ ఇంట్లో కనిపించిన 15 మంది యువతులను ప్రశ్నించగా కట్కూరీకి చెందిన అనేక డొల్ల కంపెనీలలో పనిచేస్తున్నట్లు వారు చెప్పారు.

ఆ కంపెనీలకు కట్కూరీతోపాటు ఆయన భార్య ద్వారకా గుండా యజమానిగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆ ఇంట్లో నుంచి అనేక లాప్‌టాప్‌లు, సెల్ ఫోన్లు, ప్రింటర్లు, నకిలీ డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రిన్స్‌టన్, మెలిస్సా, మెక్ కిన్నే తదితర అనేక ప్రదేశాలలో ఆ యువతుల చేత బలవంతంగా పనిచేయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మరో 100 మందికి పైగా ఈ రాకెట్‌లో ఉన్నారని, వారిలో సగం మంది బాధితులు ఉండవచ్చని ప్రిన్స్‌టన్ పోలీసు సార్టెంట్ కారోలిన్ క్రాఫోర్డ్ తెలిపారు. అయితే భారత్ నుంచి అక్రమంగా రవాణా చేసి తీసుకువచ్చిన ఆ యువతుల చేత బలవంతంగా ఎటువంటి పనులు చేయిస్తున్నదీ పోలీసులు వెల్లడించలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News