Friday, October 18, 2024

పుతిన్‌తో మోడీ ఆలింగనం… తీవ్రంగా స్పందించిన జెలెన్‌స్కీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రష్యాలో రెండు రోజుల పర్యటన కోసం భారత ప్రధాని నరేంద్రమోడీ సోమవారం మాస్కోకు చేరుకున్నారు. ఆయనకు రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా పుతిన్ మోడీకి ప్రత్యేకంగా ఆతిథ్యమిచ్చారు. వీరిద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ పరిణామాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించారు.

పుతిన్‌తో మోడీ భేటీ తమను తీవ్రంగా నిరాశపర్చిందని, ఇది వినాశనకరమైన దెబ్బని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. మాస్కో బయట నొవొ ఒగారియోవో లో అధికార నివాసభవనంలో సోమవారం వీరిరువురూ భేటీ అయ్యారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడి ప్రారంభించిన తరువాత మోడీ రష్యా పర్యటించడం ఇదే మొదటిసారి. గత నెల జి7 దేశాల సదస్సులో మోడీతో భేటీ అయిన జెలెన్‌స్కీ తన ఎక్స్ పోస్ట్‌లో ఇప్పుడు పుతిన్,మోడీ భేటీ కావడం శాంతి ప్రయత్నాలకు భంగం కలిగించేదిగా వ్యాఖ్యానించారు. నిరాశతోపాటు వినాశనకరమైన పరిణామంగా నిరసన తెలిపారు.

“ఉక్రెయిన్‌లో సోమవారం రష్యా జరిపిన క్షిపణి దాడిలో 37 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. 13 మంది పిల్లలు సహా 170 మంది గాయపడ్డారు. ఆ వెంటనే మరో చిన్నారుల ఆస్పత్రిపై రష్యా క్షిపణి విరుచుకుపడింది. ఎంతోమంది శిధిలాల కింద సమాధి అయ్యారు. అలాంటి రోజున ప్రపంచం లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి చెందిన నాయకుడు (మోడీని ఉద్దేశిస్తూ), ప్రపంచం లోనే అత్యంత కిరాతక నేరస్థుడిని (పుతిన్‌ను ఉద్దేశిస్తూ) మాస్కోలో ఆలింగనం చేసుకున్నారు. ఇది తీవ్ర నిరాశ కలిగించింది. శాంతి ప్రయత్నాలకు ఇది గట్టి ఎదురు దెబ్బలాంటిదే ” అని జెలెన్‌స్కీ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. రష్యా దాడికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

రష్యాలో మోడీ పర్యటన సమయం లోనే ఉక్రెయిన్‌పై మాస్కో క్షిపణుల వర్షం కురిసింది. ఐదు నగరాలను లక్షంగా చేసుకుని భీకర దాడులు చేసింది. మొత్తం 40 క్షిపణులను ప్రయోగించింది. ఇందులో అనేక అపార్ట్‌మెంట్లు, ప్రభుత్వ భవనాలు, ఆస్పత్రులు కూలిపోయాయని జెలెన్‌స్కీ తెలిపారు. ఇదిలా ఉండగా రష్యా అధ్యక్షుడితో భేటీ సందర్భంగా ఉక్రెయిన్‌తో యుద్ధం అంశాన్ని మోడీ ప్రస్తావించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. “దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని భారత్ ఎప్పుడూ గౌరవిస్తుంది. అయితే యుద్ధ భూమిలో దేనికీ పరిష్కారాలు లభించవు. చర్చలు, దౌత్యమే ముందుకెళ్లే మార్గాలు ” అని పుతిన్‌కు మోడీ సూచించినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News