కలకలం రేపిన జెఎన్‌టియు, మోడల్ స్కూల్ బ్రేక్ ఫాస్ట్ ఘటనలు
జెఎన్‌టియులో చట్నీలో ఎలుక ఘటనపై
మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం
విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు
మోడల్ స్కూల్‌లో ఉప్మాలో బల్లి పడిన ఘటనలో
వంట మనిషిని, సహాయకుల తొలగించిన పాఠశాల విద్యాశాఖ
మనతెలంగాణ/హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లోని జెఎన్‌టియు క్యాంపస్‌లో ఉదయం అల్పాహారం కోసం చేసిన చట్నీలో ఎలుక కనిపించడం, మెదక్ జిల్లా కోమటిపల్లి మోడల్ స్కూల్‌లో ఉప్మాలో బల్లి పడిన ఘటనలు తీవ్ర కలకలం రేపాయి. విద్యార్థులు అందించే అల్పాహారంలో ఒక చోట చట్నీలో ఎలుక కనబడటం, మరో చోట ఉప్మా బల్లి పడటం ఘటనలు విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేశాయి.
విద్యార్థులకు అందించే ఆహార పదార్ధాల వంటకాలలో నిర్వాహకులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లోని జెఎన్‌టియు బాలుర హాస్టల్ క్యాంటీన్‌లోని చట్నీ పాత్రకు మూత పెట్టకపోవడంతో ఓ ఎలుక అందులో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థులు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కొందరు ప్రజా ప్రతినిధులకు ఆ వీడియోను పంపించారు. నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆ కళాశాల ప్రిన్సిపల్ స్పందించారు. చట్నీ పాత్రలో ఎలుక పడలేదని ఆయన స్పష్టం చేశారు. శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో మాత్రమే ఎలుక కనిపించిందని పేర్కొన్నారు. కొందరు విద్యార్థులు కావాలనే వీడియో తీసి ప్రజాప్రతినిధులకు పంపించారని ఆయన ఆరోపించారు. అలాగే మెదక్ జిల్లా రామాయంపేట ఆదర్శ పాఠశాల వసతి గృహంలో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బల్లి పడిన అల్పాహారం తీసుకున్న విద్యార్థులు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకోవడంతో దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 17 మందిని పరీక్షించిన వైద్యులు, తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరి విద్యార్థినులను పరిశీలనలో ఉంచారు.
జెఎన్‌టియు ఘటనపై మంత్రి రాజనరింహ ఆగ్రహం
జెఎన్‌టియు క్యాంపస్‌లో అల్పాహారం కోసం చేసిన చట్నీలో ఎలుక పడిన ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై తక్షణం విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని జిల్లా అదనపు కలెక్టర్, ఆర్‌డిఒ, ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల హాస్టళ్లు, క్యాంటీన్‌లలో తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆహార పదార్థాలు తయారు చేసే నిర్వాహకులు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ లైసెన్స్‌ను తీసుకోవాలని మంత్రి కోరారు. ఆహార భద్రతా నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని,ఆయా సంస్థల లైసెన్స్‌లను రద్దు చేయాలని స్పష్టం చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు బేకరీలు, హాస్టళ్లు, క్యాంటీన్లు, ఆహార పదార్థాలు తయారు చేసే నిర్వాహకులపై నిఘా ఉంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
కాంట్రాక్టర్‌పై అడిషనల్ కలెక్టర్ ఆగ్రహం: మంత్రి ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి క్యాంపస్‌కు వెళ్లారు. అక్కడ వంట గదిని పరిశీలించగా, అపరిశుభ్రంగా ఉండటంతో కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మెస్ కాంట్రాక్టర్‌ను మార్చి కొత్త వారిని చేర్చుకోవాలని ఆదేశించారు. అంతకు ముందు విద్యార్థులను అడిగి వివరాలు తీసుకున్నారు. ప్రతిరోజు ఆహారంలో ఏదో ఒకటి వస్తున్నాయని విద్యార్థులు వాపోయారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని వడ్డించాలని అదనపు కలెక్టర్ సిబ్బందికి సూచించారు.
మోడల్ స్కూల్ ఘటనపై విద్యాశాఖ చర్యలు
మెదక్ జిల్లా కోమటిపల్లి మోడల్ స్కూల్‌లో అల్పాహారంలో ఉప్మాలో బల్లి పడిన ఘటన బాధ్యులపై పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంది. స్కూల్‌లో పనిచేసే వంట మనిషితోపాటు వంట సహాయకులను విధుల నుంచి తప్పించినట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఇ.వి.నర్సింహారెడ్డి వెల్లడించారు. మోడల్ స్కూల్ గర్ల్ హాస్టల్ స్పెషల్ ఆఫీసర్లకు షోకాజ్ నోటిసులు జారీ చేసినట్లు తెలిపారు.ఉదయం విద్యార్థులకు ఇచ్చిన అల్పాహారంలో బల్లి పడడం గమనించి వెంటనే పాఠశాల కేర్ టేకర్ విద్యార్థులందరిని తినవద్దని హెచ్చరించారని, అయినప్పటికీ 17 మంది విద్యార్థులకు వాంతులు వచ్చినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంఎల్‌ఎ మైనంపల్లి హనుమంతరావు ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించారు.