Monday, November 18, 2024

అస్కార్ లెవల్లో రాహుల్ యాక్టింగ్

- Advertisement -
- Advertisement -

ఆయారాం..గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీనే
పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నది
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను మర్చిపోయి ఆరుగురు ఎంఎల్‌ఎలను, ఆరుగురు ఎంఎల్‌సిలను చేర్చుకుంది
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీ తీరుపై కెటిఆర్ ఆగ్రహం

మనతెలంగాణ/హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం మరింత కఠినతరం చేస్తామన్న కాంగ్రెస్ దాన్ని గాలికి వదిలేసి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదని మండిపడ్డారు. మాజీ మంత్రి హరీశ్ రావు, ఎంపీలు సురేశ్ రెడ్డి, దీవకొండ దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి మంగళవారం పార్టీ ఫిరాయింపులపై కెటిఆర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆయారాం.. గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీనే అని పేర్కొన్నారు.

2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలుమార్లు ఆ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని విమర్శించారు. బిజెపి, కాంగ్రెస్ రెండూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే అని పేర్కొన్నారు. సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎంఎల్‌ఎల ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారని చెప్పారు. రాజ్యాంగ రక్షణ చేస్తున్నామని కాంగ్రెస్ ఒక పక్క గొప్పలు చెప్పుకుంటూ మరో పక్క పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని విమర్శించారు.

ఫిరాయింపులపై న్యాయపత్రలో హామీ ఇచ్చి తెలంగాణలో ప్రోత్సహిస్తోంది
ఆటోమేటిక్‌గా అనర్హత వేటు వేసేలా పదో షెడ్యూల్‌ను సవరణలు చేస్తామని కాంగ్రెస్ న్యాయ పత్రలో హామీ ఇచ్చి తెలంగాణలో ఫిరాయింపుల ప్రోత్సహిస్తోందని కెటిఆర్ మండిపడ్డారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని, డిసెంబర్ 9న రుణ మాఫీ చేస్తామని చెప్పారని, కానీ ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేరలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను మర్చిపోయి ఆరుగురు ఎంఎల్‌ఎలను, ఆరుగురు ఎంఎల్‌సిలను చేర్చుకుందని ఎద్దేవా చేశారు.

గోవా, కర్ణాటకలో కాంగ్రెస్ ఎంఎల్‌ఎలను బిజెపి కొనుగోలు చేస్తున్నదన్న రాహుల్ గాంధీ.. ఇప్పుడు తెలంగాణాలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలను, ఎంఎల్‌సిలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారని అన్నారు. గతంలో మణిపూర్‌లో ఓ ఎంఎల్‌ఎ పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ పిటిషన్‌పై విచారణ ద్వారానే సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చిన విషయాన్ని కెటిఆర్ గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా బిజెపి పార్టీ ఫిరాయింపులపై పోరాటమంటూనే తెలంగాణలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోళ్లకు ఎందుకు పాల్పడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎంఎల్‌ఎ ఒక్కొక్కరికి రూ. 50 కోట్లు ఇచ్చి బిజెపి కొనుగోలు చేసిందని సిద్దిరామయ్య ఆరోపించారని గుర్తు చేశారు. మరి తెలంగాణలో ఎంఎల్‌ఎ కొనుగోళ్లకు ఎంత ఖర్చు చేస్తున్నారో రాహుల్ గాంధీ చెప్పాలన్నారు.

న్యాయ, రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు
పార్టీ ఫిరాయింపుల విషయంలో న్యాయం కోసం ఢిల్లీలో నాలుగు రోజులుగా న్యాయ, రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు జరిపినట్లు కెటిఆర్ చెప్పారు. బిఆర్‌ఎస్ గుర్తుపై గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ బి.ఫాం పై పోటీ చేసిన విషయాన్ని కెటిఆర్ గుర్తు చేశారు. ఇంత బహిరంగంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేశామని, హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. లోక్‌సభ స్పీకర్, రాజ్య సభ ఛైర్మన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనేత్తుతామని, అవకాశం ఉన్న అన్ని వేదికల్లో న్యాయ పోరాటం చేస్తామని కెటిఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బిజెపి బాధిత పార్టీలతో కలిసి భవిష్యత్తులో పార్టీ ఫిరాయింపుల చట్టం బలోపేతం చేసేందుకు పోరాటం చేస్తామన్నారు. పాంచ్ న్యాయ్‌లో కాంగ్రెస్ చెప్పిన విధంగా పార్టీ మారగానే ఆటోమేటిక్‌గా సభ్యత్వం రద్దయ్యేలా చట్టం తేవాలని కెటిఆర్ కోరారు.

ఎపిలో వైసిపి ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించింది
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి ఓడిపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని కెటిఆర్ అన్నారు. ఆ పార్టీ ఓడినా 40 శాతం ఓట్లు సాధించడం మామూలు విషయం కాదని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో కెటిఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పవన్‌కళ్యాణ్ విడిగా పోటీ చేస్తూ ఫలితాలు మరోలా ఉండేదని చెప్పారు. జగన్‌ను ఓడించేందుకు షర్మిలను పావుగా ఉపయోగించుకున్నారని, అంతకుమించి ఆమె పాత్ర ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ప్రతిరోజూ జనంలోకి వెళ్లే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమే అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News