Sunday, November 24, 2024

దమ్ముంటే ఆమరణ దీక్షకు ఇద్దరూ కూర్చోండి: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో: డిఎస్‌సి పరీక్ష వాయిదా వేయాలని అమాయక విద్యార్థులను రెచ్చగొట్టడం కాదు.. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బావ, బామర్దులు ఇద్దరూ ఆమరణ దీక్షకు కూర్చోవాలి’ అని సిఎం రేవంత్ రె డ్డి కెటిఆర్, హరీష్‌కు సవాల్ విసిరారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మంగళవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కెసిఆర్, కెటిఆర్, హరీష్‌రావుపై తీవ్ర ఎదురుదాడి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు నష్టం జరుగుతుందని నిజం గా అనుకుంటే.. ఇద్దరూ ఒయు ఆర్ట్ కాలేజీ ఎదుట ఆమరణ దీక్షకు దిగాలి’ అని సూచించారు. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం లేదని..కానీ నిరుద్యోగులు నష్టపోకూడదనే ఆలోచనని అన్నారు.

‘నాలుగు రోజులుగా కెటిఆర్, హరీష్‌రావు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు.. గ్రూప్స్, డి ఎస్‌సి పరీక్షలు వాయిదా వేయాలని దొంగలు గూడుపుఠాణీ చేస్తున్నారు… కోచింగ్ సెంటర్ల మాఫియా పరీక్షలను వాయిదా వేయాలని చూస్తోంది.. వాళ్ల ధనదాహం కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు’ అని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంటే… విద్యార్థుల శవాలతో రాజకీయ లబ్ధి పొందాలని కెసిఆర్ చూస్తున్నారని ఆరోపించారు. ‘పేదోళ్ల పిల్లలను రెచ్చగొట్టడం కాదు..నిజంగా మీ వాదన నిజమైతే వారి పక్షాన మీరు దీక్షకు దిగాలి’ అని సిఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. బిఆర్‌ఎస్‌కు బతుకు లేదనే కెసిఆర్ కాంగ్రెస్‌పై కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇప్పటికీ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిఆర్‌ఎస్, బిజెపి కుట్రలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.

పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత ఆర్‌టిసి బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అమలు చేస్తుంటే బిఆర్‌ఎస్ నాయకులకు మింగుడు పడడం లేదని సిఎం అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే ఎన్నో మంచి పనులు చేస్తుంటే బిఆర్‌ఎస్ మాత్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కెసిఆర్‌కు కాంగ్రెస్ ఉసురు తగిలిందని అన్నారు. తమ ఎంఎల్‌ఎలను, ఎంఎల్‌సిలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని బిఆర్‌ఎస్ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎంఎల్‌ఎలను చేర్చుకోలేదా? అని నిలదీశారు.

బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను ఎంతో హింసకు గురిచేశారని అన్నారు. దాడులు జరుగుతున్న సమయంలో కెసిఆర్ చెబుతున్న రాజనీతి ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. తనవరకు వస్తే గాని కెసిఆర్‌కు బాధ తెలియడం లేదన్నారు.‘మీలాగా మేము దొంగ దెబ్బతీయడం లేదు. మీలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం లేదు… కెసిఆర్.. నీకు ముందుంది ముసళ్ల పండుగ’ అని అన్నారు. ‘మా ఎంఎల్‌ఎలను నీవు గుంజుకున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా?’ అని నిలదీశారు. బిజెపి, బిఆర్‌ఎస్ ఒక్కటై తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశాయని, కాంగ్రెస్‌తో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని తాను ఆనాడే చెప్పానని అన్నారు. కెసిఆర్‌కు ఇక రాజకీయ మనుగడ లేదని వ్యాఖ్యానించారు. ‘చేతనైతే అభివృద్ధికి సహకరించు.. లేకపోతే ఫాంహౌస్‌లోనే కూర్చో..’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News