లోక్‌సభ ఎన్నికల్లో చెప్పుకోదగినన్ని సీట్లు గెలుచుకుని ఎన్‌డిఎకి పక్కలో బల్లెంలా మారిన కాంగ్రెస్ పార్టీ తనకు అందివచ్చిన ప్రతి అంశాన్నీ వినియోగించుకుంటూ, అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. విపక్ష నేత రాహుల్ గాంధీ మణిపూర్‌లో తాజాగా జరిపిన పర్యటన ఈ కోవకు చెందినదే. ప్రధాని మోడీ రష్యాకు పయనమవుతున్న వేళ రాహుల్ అసోం, మణిపూర్ రాష్ట్రాల్లో పర్యటించడం వ్యూహాత్మకమైన ఎత్తుగడ. వరదలతో అతలాకుతలమవుతున్న అసోంను, అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌ను ప్రధాని విస్మరిస్తున్నారనే సంకేతాలను జనంలోకి బలంగా పంపడంలో రాహుల్ కృతకృత్యులయ్యారనే చెప్పాలి. పునరావాస శిబిరాల్లో మగ్గుతున్న బాధితులను పరామర్శించిన రాహుల్, ప్రధాని మణిపూర్‌లో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పాలంటూ మరోసారి పిలుపునిచ్చారు.
ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో గెలుపుకోసం ప్రధాని మోడీ కాలికి బలపం కట్టుకుని దేశమంతటా తిరిగారు. విపక్షాలను ఆత్మరక్షణలో పడవేసేందుకు దొరికిన ఏ చిన్న అస్త్రాన్నీ ఆయన వదలుకోలేదు. చివరకు పశ్చిమ బెంగాల్ లోని సందేశ్ ఖాలీలో అత్యాచారాలకు గురైన మహిళలతో సైతం సమావేశమై, అధికార తృణమూల్ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టే ప్రయత్నం చేశారు. కానీ, ఏడాదిగా అతలాకుతలమవుతున్న మణిపూర్‌ను సందర్శించేందుకు మాత్రం ఆయనకు మనసు రాకపోవడం విచిత్రం. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చేసిన ప్రసంగంలోనూ ప్రధాని మణిపూర్ ప్రస్తావన తేవడానికి ఇచ్చగించకపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. లోక్‌సభలో ప్రధాని ప్రసంగిస్తున్నంత సేపూ విపక్షాలు ‘మణిపూర్.. మణిపూర్’ అంటూ నినదిస్తున్నా ఆయన మాటమాత్రంగానైనా ఆ అంశం గురించి మాట్లాడలేదు. అయితే ఇది చినికిచినికి గాలివానలా మారి, ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేస్తుందని పసిగట్టిన ప్రధాని రాజ్యసభలో మణిపూర్ గురించి మాట్లాడుతూ, ప్రతిపక్షాలపై ఆగ్రహం వెళ్లగక్కారు.
కాంగ్రెస్ హయాంలో మణిపూర్‌లో పదిసార్లు రాష్ట్రపతి పాలన విధించారంటూ విమర్శించిన ప్రధాని, తాను ఇప్పటి వరకూ ఆ రాష్ట్రంలో పర్యటించకపోవడానికి వివరణ ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయలేదు. మణిపూర్‌లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అల్లర్లను అదుపు చేయడంలో విఫలమైందనడంలో సందేహం లేదు. దీన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా మలచుకోవడంలోనూ ఆశ్చర్యం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ప్రతిష్ఠకు పోయి, సమస్య పరిష్కరంపై నాన్పుడు ధోరణి వహిస్తూ ఉండటమే విడ్డూరం. ఒక దశలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా మణిపూర్‌లో ఏడాదైనా శాంతి నెలకొనలేదంటూ పెదవి విరిచారు. భారతీయ స్విట్జర్లాండ్‌గా పేరొందిన మణిపూర్‌లో గత ఏడాది మే నెల నుంచి శాంతి భద్రతలు అదుపు తప్పాయి. జనాభాలో అధిక శాతం ఉన్న మైతేయిలను ఎస్‌టిల జాబితాలో చేర్చే విషయాన్ని పరిశీలించాలంటూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల అనంతరం అల్లర్లు ప్రారంభమయ్యాయి.
నాగా- కుకీ తెగలకు, మైతేయి తెగకు మధ్య చెలరేగిన ఘర్షణల్లో దాదాపు 221 మంది కన్నుమూయగా, 60 వేల మందికి పైగా నిరాశ్రయులై, పునరావాస శిబిరాల్లో మగ్గుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన తాత్కాలిక ఉపశమన చర్యల వల్ల కొన్ని రోజులు ప్రశాంతంగానే ఉన్నా మళ్లీ అల్లర్లు మొదలయ్యాయి. గత నెలలో ముఖ్యమంత్రి ముందస్తు భద్రత వాహన శ్రేణిపైనే దుండగులు కాల్పులకు తెగబడ్డారు. అంతకుముందు నెలలో భద్రతా సిబ్బంది శిబిరంపై కాల్పులు జరిపి ఇద్దరు సిఆర్‌పిఎఫ్ జవాన్ల ఉసురు తీశారు. ఈ నేపథ్యంలో బాధిత రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవడం తక్షణ కర్తవ్యం.
పది రోజుల క్రితం తమ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి ఇన్నర్ మణిపూర్ ఎంపి, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ ప్రొఫెసర్ అయిన బిమోల్ అకోయిజామ్ చేసిన ప్రసంగం వింటే ఎవరికైనా కళ్లు చెమర్చకమారవు. ‘మీ గుండెల మీద చేయి వేసుకుని, మణిపూర్‌లో నిరాశ్రయులైన వారి గురించి, వారి తల్లులు, పిల్లలు, భర్తలను పోగొట్టుకున్న మహిళల గురించి ఆలోచించండి. ఆ తర్వాత చర్యలకు ఉపక్రమించండి. అక్కడ ఆయుధాలు చేతబట్టి తమ గ్రామాలను కాపాడుకునేందుకు యుద్ధం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏడాదిగా కొనసాగుతున్న ఈ హింసాకాండపై చేష్టలుడిగి చూస్తోంది అంటూ చేసిన ఆవేదనాభరిత ప్రసంగం పాలకులకు కనువిప్పు కావాలి.