బొంబాయి హైకోర్టు శుక్రవారం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి ఒక పరువునష్టం కేసులో ఉపశమనం కలిగించింది. పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ పరువునష్టం ఫిర్యాదులో సరికొత్త, అదనపు డాక్యుమెంట్ల దాఖలుకు ఒక ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తను అనుమతిస్తున్న మేజిస్ట్రేట్ ఉత్తర్వును హైకోర్టు కొట్టివేసింది. మహాత్మా గాంధీ హత్యకు ఆర్‌ఎస్‌ఎస్‌దే బాధ్యత అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక ప్రసంగంలో తప్పుడు. పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త రాజేశ కుంతె 2014లో భివాండి మేజిస్ట్రేట్ కోర్టులో ఒక పరువునష్టం ఫిర్యాదు దాఖలు చేశారు. తనకు జారీ చేసిన సమన్ల రద్దు కోరుతూ రాహుల్ 2014లో దాఖలు చేసిన పిటిషన్‌లో భాగంగా ఉన్న ఆయన ప్రసంగం రాతప్రతిని సమర్పించేందుకు కుంతెను ఠాణె జిల్లా భివాండిలోని మేజిస్ట్రేట్ కోర్టు 2023లో అనుమతించింది.
తన పిటిషన్‌లో భాగంగా రాతప్రతిని చేర్చడం ద్వారా రాహుల్ తన ‘ప్రసంగాన్ని, అందులోని అంశాలను నిర్దంద్వంగా తనవేనని చెప్పుకున్నట్లు’ అయిందని కుంతె వాదించారు. రాహుల్ మేజిస్ట్రేట్ ఉత్తర్వును హైకోర్టులో సవాల్ చేశారు. జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్ సింగిల్ బెంచ్ శుక్రవారం రాహుల్ పిటిషన్‌ను అనుమతించింది. ‘పిటిషన్‌ను అనుమతించడమైంది. సదరు ఉత్తర్వును. తదుపరి డాక్యుమెంట్ల ప్రదర్శనను రద్దు చేయడమైంది. కొట్లివేయడమైంది. ఉత్తర్వులో చేసిన వ్యాఖ్యల ప్రకారం డాక్యుమెంట్ల ప్రదర్శన విషయంలో విచారణను కొనసాగించవలసిందిగా మేజిస్ట్రేట్ కోర్టును ఆదేశించడమైంది’ అని హైకోర్టు తెలిపింది. విచారణను శీఘ్రంగా నిర్వహించవలసిందని మేజిస్ట్రేట్‌ను ఆదేశించిన జస్టిస్ చవాన్ ఈ వ్యవహారంలో సహకరించవలసిందిగా ఉభయ పక్షాలను కోరారు.