కాకినాడ: పుట్టుకరీత్యా కాపు కులస్థుడైన ముద్రగడ పద్మనాభం ఇటీవల పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్నారు. పైగా కాపు రిజర్వేషన్లు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇది ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో ముద్రగడ భీష్మ శపధం వంటిది చేశారు. పవన్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని సవాలు విసిరారు. ఎన్నికల్లో వైసిపి ఓడిపోయి, పవన్ కళ్యాణ్ తాలూకు జనసేన పార్టీ విజయం సాధించింది. దాంతో జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆయనని పదేపదే ప్రశ్నించడం మొదలెట్టారు. దాంతో విసుగు చెందిన ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్నారు. ఇక ఆపండిరా…అంటూ మొరపెట్టుకున్నాడు. వేధించడం కన్నా ఎవరినైనా పంపి చంపేయండిరా.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రలో ఉపముఖ్యమంత్రి కూడా అయి కూర్చున్నారు. ఇక ముద్రగడకు ఏడుపొక్కటే తరువాయి.
జగన్ హయాంలో కాపు రిజర్వేషన్లపై ఎందుకు మాట్లాడలేదో ముద్రగడను ప్రశ్నించారు. చంద్రబాబు సిఎంగా ఉన్న హయాంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు.. ఇడబ్ల్యూఎస్ కింద ఐదు శాతం వాటా ఇచ్చారని గుర్తు చేశారు. జగన్ ఈడబ్ల్యూఎస్ వాటా తీసేస్తే ఎందుకు మాట్లాడలేదని, విద్యుత్ చార్జీలు పెంచితే ఎందుకు ఉద్యమించలేదని ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు కాపు సంఘం నేతలు. పవన్ సొంత డబ్బులను కౌలు రైతులకు పంచారని, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న చంద్రబాబుపై ఎందుకంత ద్వేషం అని ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ముద్రగడ లేఖలు రాయడం, ప్రశ్నించడం ఇకనైనా మానుకోవాలని హితవు పలుకుతున్నారు కాపు సంఘం నేతలు. పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడకు తమ రిజర్వేషన్లు, హక్కులపై మాట్లాడే హక్కు లేదంటున్నారు.