ములుగు: మంత్రి సీతక్క ఓ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఇదివరలో గిరిజనులకు ఏ రోగం వచ్చినా మైళ్ల దూరం వెళ్లి చికిత్స చేయించుకోవడం లేదంటే చెట్ల ఆకు పసరులు తిని బతికి బట్టకట్టడం మాత్రం చేస్తుండేవారు. కానీ ఇప్పుడు మంత్రి సీతక్క తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో కంటైనర్ హాస్పిటల్ ను అందుబాటులోకి తెచ్చారు. ములుగు జిల్లా కలెక్టర్ దినకర్ సరికొత్త ఆలోచనకు ఆమె శ్రీకారం చుట్టారు. దేశంలోనే ప్రప్రథమంగా కంటైనర్ హాస్పిటల్ ను ములుగులో అందుబాటులోకి తెచ్చారు.
ప్రతి ఏటా వానా కాలంలో మన్యం ప్రాంతంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. గర్భిణీ మహిళలకు సకాలంలో వైద్యం అందడం దుర్భరం. పాము కాటు పడ్డ వారి పరిస్థితయితే చెప్పనవసరం లేదు. రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న మారుమూల గ్రామాల వారికి ఈ కంటైనర్ హాస్పిటల్ ద్వారా సేవలందండం హర్షణీయం. జాతీయ రహదారికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు జిల్లా తాడ్వాయి మండలం బంధాల గ్రామ పంచాయతీ పరిధిలోని పోచాపూర్‌లో ఈ కంటైనర్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేశారు. పైలెట్ ప్రాజెక్టుగా పోచాపూర్‌లో ఏర్పాటు చేసిన కంటైనర్ ఆసుపత్రిని మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. పోచాపూర్ గ్రామానికి చుట్టూ నర్సాపూర్, అల్లిగూడెం, బందాల, బొల్లెపల్లి గ్రామాలకు ఇక ఈ హాస్పిటల్ ద్వారా వైద్యం అందుబాటులోకి రానున్నది.
నాలుగు పడకల ప్రత్యేక గది గల కంటైనర్‌ను సుమారు రూ.7 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఏ చిన్న పాటి జబ్బులు తలెత్తినా ఇందులో వైద్య చికిత్స అందిస్తారు. ఇందులో మందులతో పాటూ వైద్యపరీక్షలు జరిపే చిన్నపాటి ల్యాబులు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ప్రసవం సమయంలో గర్భిణీలు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయనవసరం లేకుండా ఈ కంటైనర్ హెల్త్ కేర్ యూనిట్ లోనే చికిత్స అందిస్తారు.