Monday, December 23, 2024

కెసిఆర్ పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విద్యుత్ కొనుగోళ్ల దర్యాప్తు కమిషన్ ఏర్పాటుపై తెలంగాణ మాజీ సిఎం కె చంద్రశేఖర్ రావు పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు(సోమవారం) విచారిస్తుంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సారథ్యంలోని న్యాయమూర్తులు జెబి పార్థీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం పరిధిలో ఈ పిటిషన్ విచారణ ఖరారయింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఉన్నప్పుడు ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ విద్యుత్ పంపిణీ కంపెనీలకు విద్యుత్ కొనుగోళ్లు, మణుగూరులో భద్రాది థర్మల్ పవర్ ప్లాంట్, దామెరచర్లలో యాదాద్రి ధర్మల్ ప్లాంట్ నిర్మాణాల నిర్ణయాలపై దర్యాప్తునకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనికి వ్యతిరేకంగా కెసిఆర్ రాష్ట్ర హైకోర్టుకు వెళ్లారు. కమిషన్ ఏర్పాటును చట్టవ్యతిరేకమని ప్రకటించాలనే ఆయన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీనితో ఇప్పుడు కెసిఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు తీర్పును సవాలుచేశారు. కమిషన్‌కు పక్షపాత ధోరణితో ఉండే రిటైర్డ్ జస్టిస్ ఎల్ నర్మింహ రెడ్డి సారధ్యం వహించడం అన్యాయం అని కెసిఆర్ తమ పిటిషన్‌లో తెలిపారు. అయితే కెసిఆర్ పేర్కొన్న అంశాలు ఆరోపణలుగా ఉన్నాయని, వీటికి ఆయన ఎటువంటి ప్రాతిపదిక చూపలేదని పేర్కొంటూ ఈ నెల 1వ తేదీన రాష్ట్ర హైకోర్టు 22 పేజీల తీర్పు వెలువరించింది. తనకు కమిషన్ వెలువరించిన సమన్లను సవాలు చేశారు. ఛైర్మన్‌కు రాసిన లేఖలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ఎటువంటి విద్యుత్ సమస్య లేకుండా చేసేందుకు పలు చర్యలు తీసుకున్నామని , ఈ క్రమంలో ఆటంకాలు లేకుండా అన్ని రంగాలకు 24/7 కరెంటు అందుతోందని, ఈ దశలో తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టడం, కమిషన్ ఏర్పాటు ఎంతవరకు సబబని కెసిఆర్ ప్రశ్నించారు. విద్యుత్ విషయంలో ఇంతకు ముందటి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు , నిర్థిష్టమైన రాజకీయ దురుద్ధేశాలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని వేసిందని కెసిఆర్ నిరసన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News