తెలంగాణ రాష్ట్రంలో రాగల ఐదురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్ర ప్రదేశ్‌లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన ఆవర్తనం పశ్చిమ బెంగాల్ మీదుగా ఏర్పడిన ఆవర్తనంలో కలిసిపోయిందని వాతావరణశాఖ వెల్లడించింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. అదే సమయంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నాయని వెల్లడించింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. గడిచిన 24గంటల్లో రాష్టంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ, కొత్తగూడెం, ఖమ్మం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.
హైదరాబాద్‌కు ప్రత్యేక వర్ష సూచన:
గ్రేటర్ హైదరాబాద్ నగరానికి వాతావరణ కేంద్రం ప్రత్యేక వెదర్ బులిటెన్ విడుదల చేసింది. రాగల 24గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని , తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రాత్రి సమయాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. ఆ తర్వాత 48గంటలపాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. ఉపరితల గాలులు పశ్చిమ , నైరుతి దిశల నుంచి గంటలకు 12కి.మి వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 28డిగ్రీలు, కనిష్టంగా 22డిగ్రీలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.