Monday, December 23, 2024

బహుముఖీన కృషికి నిలువుటద్దం అమ్మంగి

- Advertisement -
- Advertisement -

తెలుగు సాహిత్యంలో దీర్ఘకాలికంగా బహుముఖీన కృషి చేస్తోన్న సాహితీవేత్తల్లో ముందువరుసలో ఉండేవారు డా. అమ్మంగి వేణుగోపాల్. సుమారు ఆరు దశాబ్దాల అరుదైన సాహిత్య జీవనయానం ఆయనది. ‘సృజన’ పత్రిక 1967లో నిర్వహించిన కవితల పోటీ కోసం అంధులపై రాసిన ‘చీకటిలో బతుకునీడ’ కవితకు ప్రథమ బహుమతి పొంది, వెలుగులోకి వచ్చిన ఆయన అప్పటి నుండి వెనక్కితిరిగి చూడకుండా సాహిత్య లోకంలో వెలుగులు విరజిమ్ముతూనే ఉన్నారు. కవిత్వం, విమర్శ, పరిశోధన, కథ నాటికలు, అనువాదం, సంపాదకత్వం మొదలైన ప్రక్రియ ల్లో ఆయన చేస్తోన్న విశేష కృషి నిరంతరం సాగుతూ వస్తోంది. నేటి వికారాబాదు జిల్లా ఆలంపల్లి వాస్తవ్యులైన అమ్మంగి వేణుగోపాల్ 1948 జనవరి 20న మదనంతరావు, రుక్మిణీబాయి దంపతులకు జన్మించారు.

ఆలంపల్లి, వికారాబాదు, నారాయణఖేడ్, హైదరాబాద్‌లలో విద్యాభ్యాసం చేశారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉన్న నారాయణఖేడ్‌లో తొమ్మిదో తరగతి చదివేటప్పుడు ఉపాధ్యాయుడు నందగిరి అనంతరాజ శర్మ ప్రేరణతో ‘చందమామ’ పత్రికకు లేఖలు రాయడంతో పాటు కథారచన కూడా ప్రారంభించారు వేణుగోపాల్. ఆ రోజుల్లోనే ‘రాజు-కథ’ అనే కథ రాశారు. అప్పుడే తేటగీతి, ఆటవెలది పద్యాలపై ఆసక్తి పెరిగింది. ఆ రోజుల్లోనే సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేశారు. నిజాం కళాశాలలో పి.యు.సి., ఆర్ట్ కళాశాలలో బి.ఎ., ఎం.ఎ. చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1984లో డా. బి.వి.కుటుంబరావు పర్యవేక్షణలో ‘నవలా రచయితగా గోపీచంద్’ అనే అంశంపై పిహెచ్.డి. పూర్తిచేశారు.

తొలి రోజుల్లో ప్రభుత్వ అనువాదకుల కార్యాలయంలో జూనియర్ అనువాదకునిగా కొద్దికాలం పనిచేశారు వేణుగోపాల్. తర్వాత వివిధ కళాశాలల్లో లెక్చరర్‌గా పని చేసి, జహీరాబాద్ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులుగా ఉద్యోగ విరమణ చేశారు.‘మిణుగురు’ అమ్మంగి వేణుగోపాల్ తొలి కవితా సంపుటి. ఈ సంపుటిని 1980 లో వెలువరించారు.సుప్రసిద్ధ విమర్శకులు రాచమల్లు రామచంద్రారెడ్డి ‘మంచి మాట’ అనే పేరుతోనూ ప్రముఖ కవి వేగుంట మోహనప్రసాద్ ‘కిరణం -కిర్మీరం’ అనే పేరుతోనూ ఈ సంపుటికి ముందుమాటలు రాయడం విశేషం. ఈ సంపుటిలో అనుభూతి, భావుకత ప్రధానంగా దర్శనమిస్తాయి. పారిశ్రామిక వాడల్లో పచ్చదనం లోపించడాన్ని నిరసిస్తూ 1999లో వెలువరించిన ‘పచ్చబొట్టు పటంచెరు’ అమ్మంగి రెండో కవితాసంపుటి. సామాజిక వాస్తవికతను ప్రతిబింబిస్తూ మూడో కవితాసంపుటిని ‘భరోసా’ అనే పేరుతో 2008లో వెలువరించారు. తెలంగాణ ఉద్యమానికి చిత్రిక పట్టే ‘గంధం చెట్టు’ అనే కవితా సంపుటిని, ‘తోటంత పువ్వు’ అనే మరో కవితా సంపుటిని 2015లో తీసుకువచ్చారు.వస్తు వైవిధ్యంతో, కరోనా కాలపు కొన్ని కవితలను చేర్చి డా.అమ్మంగి వేణుగోపాల్ 2023లో వెలువరించిన సాంద్రమైన కవితల సంపుటి ‘ముఖచిత్రం’.

భావవైవిధ్యం, భాషాప్రయోగాల్లో నవ్యత అమ్మంగి కవితల్లో కనబడతాయి. చెట్టును ఆదికవిగా పేర్కొంటూ రాసిన ‘ఆదికవి’ అనే కవితలో కోట్ల సంవత్సరాల కిందట గోళాలు ఢీకొన్నప్పుడు/ ఒక ఆకుపచ్చ విత్తనం భూగర్భంలో పడింది/ జ్ఞానానికి ప్రతీక అయిన ఆ విత్తనం నుండే / పుట్టుకొచ్చిన దాన్ని తెలియనివాళ్లు ‘చెట్టు’ అంటున్నారు/నిజానికది ఆదికవి అంటారు వేణుగోపాల్. ఇది క్రీస్తు శకం కాదు దోమశకం/ చరాచర సృష్టి వినాశకం/ డెంగ్యూ మెదడు వాపు ఫైలేరియా/ ఎలో ఫీవర్ చికెన్ గునియా మలేరియా/ నీ మహనీయ విజయాల ఘర్ ఘర్ కీ కహానియా అంటూ దోమ విజయాలను ఏకరువు పెట్టి నవ్వులు కురిపిస్తారు అమ్మంగి. ఆ బలహీన క్షణాలలో/ నీ కౌగిలింతలో/ కాలుజారక తప్పలేదు/ అంతే! మబ్బుల్లో మెరుపుల్లా శోభిల్లిన నీ పళ్లు /‘ఐ లవ్ యూ’ అంటూ కాబోలు/ దంతక్షతాలు చెక్కాయి అంటూ శునక దంతక్షతాల వర్ణనతో హాస్యం సృష్టిస్తారు. తాల వర్ణనతో హాస్యం సృష్టిస్తారు. అలా నవ్వులు కురిపించిన అమ్మంగి అతడు నాలుగో కాలంలోకి నిష్క్రమించాడు/ ఒంటిమీద కొత్త వస్త్రం/ నాటకం చివర జారిన తెరలా రెపరెపలాడుతోంది / వార్త వితంతువై/ నలువైపులా పాకింది / అతని నీడ కూడా కాలిపోయింది అంటూ శోకరసాన్ని కూడా ప్రవహింపజేయగలరు.

హృదయాన్ని మెలితిప్పే మిత్రుల మరణ వార్తల బాధను అమ్మంగి వేణుగోపాల్ చెప్పే తీరుకు ‘వాక్యం ఆగిపోయింది’ కవిత ఒక ఉదాహరణ. ప్రముఖ విమర్శకులు ఆచార్య గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి అకాల మరణ వార్త పట్ల స్పందనగా ఆయన రాసిన కవిత పాఠకుల కంటి నుండి కూడా నీటిబొట్లు రాల్చగలదు. (అతడు)/ పేజీ తిప్పి కొత్త పుటమీద / రాత ప్రారంభించాడు / అతడు ఫుల్ స్టాప్ పెట్టకుండానే / వాక్యం హఠాత్తుగా ఆగిపోయింది!. శ్రమను సమర్థవంతంగా సాహిత్యంలోకి తెచ్చే రచయితలు నవతరం నిర్మాతలు. అమ్మంగి అభిప్రాయమూ అదే. అందుకే ఆయన ‘పచ్చబొట్టు పటంచెరు’ కవితా సంపుటి లోని ‘మంజీర’ కవితలో ఇలా అంటారు. సాహిత్యం రైతు చెమటకు ఉపనది…/ … మట్టిని సాహిత్యం చేసే చేతులే / కొత్త శతాబ్దాన్ని సృష్టిస్తాయి ‘నవలా రచయితగా గోపీచంద్’ అనే తన పిహెచ్.డి. సిద్ధాంత గ్రంథాన్ని 1988లో వెలువరించారు అమ్మంగి వేణుగోపాల్.

పరిశోధకుడికి తప్పనిసరి లక్షణాలైన హేతుబద్ధమైన విశ్లేషణ, నిక్కచ్చితనాలను ఈ గ్రంథంలో చూడవచ్చు. గోపీచంద్ రచనల్లో కనబడే ఆత్మకథాత్మక ధోరణి సరైనది కాదని నిష్కర్షగా ఆయన ఈ గ్రంథంలో అభిప్రాయం వ్యక్తం చేస్తారు. పరిశోధనాత్మకంగా గోపీచంద్ సాహిత్యంపై అమ్మంగి రాసిన వేర్వేరు మోనోగ్రాఫులను కేంద్ర సాహిత్య అకాడమీ, విశాలాంధ్ర ప్రచురణాలయం ప్రచురించాయి.అమ్మంగి వేణుగోపాల్ రాసిన కథానికలు చక్కటి శైలితో పాఠకుడిని చదివిస్తాయి. ఆయన రాసిన ‘వంచన’, ‘పూవులో ముళ్లు’, ‘పిచ్చితల్లి’, ‘విలువలు’, ‘పువ్వురాలుకాలం’ మొదలైన కథానికల్లోని వర్ణనలు వస్తు ప్రాధాన్యతను ఇనుమడింపజేస్తాయి. ఆరంభం కథాంశానికి చక్కటి పునాదిని ఏర్పరచడం, ముగింపులో మెలికగానీ ప్రతీకలు గానీ తప్పకుండా ఉండడం వేణుగోపాల్ కథానికల లక్షణాలు.

వివిధ గ్రంథాలకు సంపాదకత్వ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు అమ్మంగి వేణుగోపాల్. వాటిలో మెదక్ మండల రచయితల సంఘం 1975లో ప్రచురించిన ‘కలం గీసిన చిత్రాలు’ అనే కవితా సంకలనం, మంజీర రచయితల సంఘం 1988లో ప్రచురించిన ‘వ్యాస మంజీర’ అనే వ్యాస సంపుటి, జయమిత్ర సాహిత్య సాంస్కృతిక సంస్థ ప్రచురించిన ‘మరో కొత్త వంతెన -ఏక్ ఔర్ నయా పూల్’ అనే ద్విభాషా కవితా సంపుటి, మజహర్ మెహదీ రాసిన కవితలతో కూర్చిన ‘మజహర్ మెహదీ-మరో ప్రపంచం’ అనే కవితా సంపుటి, ప్రాచ్య లిఖిత గ్రంథాలయం 2012లో వెలుగులోకి తెచ్చిన గోపీ కృష్ణ రచన ‘తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి జీవిత చరిత్ర’, శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా వెలువరించిన ‘ప్రజల పక్షాన ప్రతిజ్ఞ’ అనే గ్రంథం మొదలైనవి ఉన్నాయి. విమర్శకులుగా ప్రసిద్ధులైన డా. అమ్మంగి వేణుగోపాల్ ‘అవినాభావం’ అనే విమర్శనా వ్యాసాల సంకలనాన్ని 1990లో, ‘సాహిత్య సందర్భం- సమకాలీన స్పందన’ అనే మరో వ్యాస సంకలనాన్ని 2012లో వెలువరించారు. ‘వట్టికోట ఆళ్వార్ స్వామి రచనలు- ఒక పరిశీలన’ గ్రంథాన్ని 2014లో ‘సహృదయ సాహిత్య విమర్శ- వైవిధ్యం’ గ్రంథాన్ని 2018లో ప్రచురణ రూపంలోకి తెచ్చారు. ‘అమ్మంగి వేణుగోపాల్ నాటికలు’ అనే పేరుతో రేడియో కోసం రాసిన నాటికలను 2008లో ప్రచురించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి సభ్యులుగా, కేంద్ర సాహిత్య అకాడమీ సలహా సంఘ సభ్యులుగా, ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ స్నాతకోత్తర పాఠ్యప్రణాళికా సంఘ సభ్యులుగా పని చేశారు అమ్మంగి వేణుగోపాల్. ఆయన రచనలను వివిధ విశ్వవిద్యాలయాలు పాఠ్యగ్రంథాల్లో చేర్చాయి. సృజనాత్మక రచనలో అత్యంత ప్రతిభ కనబర్చినందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వ కాళోజీ స్మారక పురస్కారాన్ని నెలకొల్పిన తొలి ఏడాదే పొందారు అమ్మంగి వేణుగోపాల్. తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారాన్ని 2001లో, ఉత్తమ వచన కవితా సంపుటి అవార్డును 2010లో పొందారు.

సుప్రసిద్ధ కవి మఖ్దూం మొహియుద్దీన్ పేరిట ప్రతి ఏటా పురస్కారాలను అందజేస్తున్న హైదరాబాదులోని సిటీ కళాశాల ఈ ఏడాదికి అమ్మంగి వేణుగోపాల్‌ను ఆ పురస్కారానికి ఎంపిక చేసింది. వీరిద్దరూ నేటి సంగారెడ్డి జిల్లాతో అనుబంధం ఉన్నవారే కావడం విశేషం. సంగారెడ్డి జిల్లా అందోల్‌లో జన్మించిన మఖ్దూం మొహియుద్దీన్ సంగారెడ్డిలో మెట్రిక్యులేషన్ చదివారు.నారాయణఖేడ్‌లో చదువుకున్న అమ్మంగి సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ ప్రాంతాల్లో ఉద్యోగం చేశా రు. ఈ ఇరువురూ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు. ఇద్దరూ ఉపన్యాసకులుగా పని చేశారు. ఇద్దరికీ ఉర్దూ సాహిత్యంతో అనుబంధం ఉంది. అనువాద ప్రక్రియలో అభినివేశం ఉంది. కవిత్వంలోనూ నాటక రచనలోనూ వీరిద్దరూ కృషి చేశారు. బహుముఖ ప్రజ్ఞతో ఆరు దశాబ్దాలుగా గణనీయమైన సాహిత్య సేవ చేస్తున్న డా. అమ్మంగి వేణుగోపాల్ ఈ పురస్కారానికి ఎంపిక కావడం ముదావహం.

డా.రాయారావు
సూర్యప్రకాశ్ రావు
9441046839

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News