Monday, December 23, 2024

డీకే శివకుమార్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో తనపై నమోదైన సీబీఐ కేసును కొట్టేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసి పుచ్చింది. దీనిపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు ధర్మాసనం వెల్లడించింది. డీకే పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు తెలిపింది.

2013-18 మధ్య అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో శివకుమార్ మంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలో డీకే సంపాదనలో రూ. 74 కోట్లు లెక్కకు మించిన ఆదాయం ఉందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆయన నివాసం, ఆఫీసుల్లో ఐటీ శాఖ సోదాలు జరిపి కొంత మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ తరువాత ఈ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ దర్యాప్తు చేపట్టింది. ఈడీ విచారణ ఆధారంగా 2020లో సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసింది.

ఈ కేసును సవాలు చేస్తూ శివకుమార్ 2021లో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అప్పట్లో ఉన్నత న్యాయస్థానం కొంతకాలం మధ్యంతర స్టే విధించింది. ఈ నేపథ్యంలో సీబీఐ కేసును కొట్టేయాలంటూ శివకుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను గతేడాది అక్టోబరులో హైకోర్టు కొట్టేసింది. అంతేగాక దీనిపై దర్యాప్తు చేసి మూడు నెలల్లోగా నివేదిక అందివ్వాలని సిబిఐని ఆదేశించింది. ఈ తీర్పుపై డీకే సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ఆయనకు ఎలాంటి ఊరట లభించలేదు. ఆయన క్వాష్ పిటిషన్‌ను కోర్టు సోమవారం కొట్టేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News