న్యూఢిల్లీ: ఆప్ నేత, సిఎం కేజ్రీవాల్ తీహార్ జైలులో కేవలం రెండు కిలోల బరువు తగ్గారని జైలు అధికారులు సోమవారం స్పష్టం చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని, ఎనిమిదిన్నర కిలోల బరువు తగ్గారని ఆప్ వర్గాలు పేర్కొనడం సత్యదూరం అని తీహార్ జైలు అధికారులు తెలిపారు.
ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ అనుబంధ హోం శాఖకు నివేదిక పంపించారు. కేవలం రెండు కిలోల బరువు తగ్గారు. పైగా ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్ మెడికల్ బోర్డు పర్యవేక్షిస్తోందని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని తమ నివేదికలో తెలిపారు. వాస్తవాలు వేరే ఉన్నాయని, అయితే పార్టీ నేతలు, మంత్రులు పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రకటనలు వెలువరిస్తున్నారని జైలు అధికార యంత్రాంగం తెలిపింది.
తమ వాదనకు అనుబంధంగా కేజ్రీవాల్ వైద్యపరీక్షలలో నిర్థారణ అయిన బిపి, షుగర్ ఇతరత్రా అంశాలను హోం విభాగానికి పంపించారు. కాగా ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ ఓ ప్రకటనలో కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం అయిందని తెలిపారు. జైలు అధికారుల నుంచి లీక్ అయిన నివేదిక తమకు ఆందోళన కల్గిస్తోందని, ఆయన బరువు పూర్తిగా తగ్గింది. బలహీనులు అయ్యారు. పైగా షుగర్ ఇతరత్రా సమస్యలతోపలు రకాలుగా రక్తపుపోటు తలెత్తుతోందని, దీని వల్ల ఆయనకు ఎప్పుడేం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నామని సంజయ్ సింగ్ ప్రకటన వెలువరించారు. దీనిపై జైలు అధికారులు స్పందించారు.
జైలులో ఆయన నరకం అనుభవించాల్సి వస్తోందని, బ్లడ్‌షుగర్ స్థాయిలు పడిపోవడం ప్రమాదకరం అని ఆప్ నేత తెలిపారు. ఇదంతా అవాస్తవం అని తీహార్ జైలు అధికారులు స్పష్టం చేశారు. ఆయన ఇంటి నుంచి వచ్చిన భోజనమే తీసుకుంటున్నారు. పైగా ఎయిమ్స్‌కు చెందిన వైద్య బృందం ఆయనను పరీక్షిస్తోంది. ఈ బోర్డుతో కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని, పరిస్థితిని తెలుసుకుంటున్నారని కూడా అధికారులు వెల్లడించారు. ఇంత జరుగుతున్నా పార్టీ నేతలు తప్పుడు వార్తలు ప్రచారం చేయడం కేవలం దురుద్ధేశపూరితం అని ఖండించారు. వారి ప్రచారాన్ని తాము తిప్పికొట్టాల్సి ఉందని స్పష్టం చేశారు. మీడియా కూడా వక్రీకరణకు పాల్పడేలా కొన్ని శక్తులు యత్నిస్తున్నందున తమ వివరణ ఇచ్చుకోవల్సి వస్తోందని తెలిపారు.