రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతలపైనే కాంగ్రెస్ సర్కార్ ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టమవుతోందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట అని…చెప్పేది ఒకటి,
చేసేది ఒకటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు. డిసెంబర్ 12, 2018 వరకు ముందున్న రైతులకు వర్తించదు అనే నిబంధన అసమంజసమని వ్యాఖ్యానించారు. రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనపడుతున్నదని అన్నారు. ఆహార భద్రత కార్డు, పిఎం కిసాన్ పథకం ప్రామాణికం అని ప్రకటించడం అంటే లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే అని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు మభ్య పెట్టారు,అధికారం చేజిక్కినాంక ఆంక్షలు పెట్టారని విమర్శించారు.