ప్రతిష్ఠాత్మకమైన యూరో కప్ ఫుట్‌బాల్ (2024) టోర్నమెంట్‌లో స్పెయిన్ విజేతగా నిలిచింది. సోమవారం తెల్లవారు ఝాము ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో స్పెయిన్ 21 గోల్స్ తేడాతో బలమైన ఇంగ్లండ్‌ను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఊహించినట్టే ఫైనల్ సమరం ఆరంభం నుంచే నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇటు ఇంగ్లండ్ అటు స్పెయిన్ ఆటగాళ్లు సర్వం ఒడ్డి పోరాడారు. దీంతో మ్యాచ్‌లో చివరి నిమిషం వరకు హోరాహోరీ తప్పలేదు. ఇంగ్లండ్, స్పెయిన్ ఆటగాళ్లు మైదానంలో పాదరసంలా కదులుతూ గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించారు. ఇరు జట్లు ఆటగాళ్లు దూకుడును ప్రదర్శించడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ప్రారంభంలో రెండు జట్లకు గోల్స్ దక్కలేదు. ఇంగ్లండ్‌తో పోల్చితే స్పెయిన్ ప్రథమార్ధంలో కాస్త పైచేయిని కనబరిచింది.
కానీ ఇంగ్లండ్ పటిష్టమైన డిఫెన్స్‌ను దాటుకుని గోల్స్ మాత్రం సాధించలేక పోయింది. ఎట్టకేలకు 47వ నిమిషంలో స్పెయిన్ శ్రమ ఫలించింది. నికో విలియమ్స్ అద్భుత గోల్‌తో స్పెయిన్‌కు ఆధిక్యం సాధించి పెట్టాడు. విలియమ్స్ చేసిన చిరస్మరణీయ గోల్‌తో స్పెయిన్ 10 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత ఇంగ్లండ్ దూకుడును పెంచింది. వరుస దాడులతో స్పెయిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. స్కోరును సమం చేసేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్లు సర్వం ఒడ్డారు. 73వ నిమిషంలో ఇంగ్లండ్ శ్రమ ఫలించింది. కొలె పల్మర్ అద్భుత గోల్ సాధించి స్కోరును 11తో సమం చేశాడు. అయితే ఈ ఆనందం ఇంగ్లండ్‌కు ఎక్కువ సేపు నిలువలేదు. 86వ నిమిషంలో మైఖేల్ ఒయర్‌జబాల్ స్పెయిన్‌కు రెండో గోల్ సాధించి పెట్టాడు. దీంతో ఇంగ్లండ్ ఒక్కసారి షాక్‌కు గురైంది. దీన్ని నుంచి తేరుకొనే లోపే స్పెయిన్ 21 తేడాతో మ్యాచ్‌ను గెలిచి యూరో కప్‌ను సొంతం చేసుకుంది.
ఇక ఈసారి ఎలాగైనా ట్రోఫీని సాధించాలని భావించిన ఇంగ్లండ్‌కు నిరాశ తప్పలేదు. ఈ టోర్నమెంట్‌లో ఇరు జట్లు అసాధారణ ఆటను కనబరిచాయి. ఒక్కో మెట్టును దాటుకుంటూ ఫైనల్ వరకు దూసుకొచ్చాయి. తుది పోరులో కూడా ఇటు ఇంగ్లండ్ అటు స్పెయిన్ అసాధారణ ఆటతో అలరించాయి. అయితే చివరి వరకు నిలకడైన ఆటను కనబరచడంలో సఫలమైన స్పెయిన్ ఛాంపియన్‌గా అవతరించింది. యూరో కప్ ట్రోఫీ సాధించడంతో స్పెయిన్‌లో సంబరాలు మిన్నంటాయి. అన్నీ ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో వేలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి సంబరాల్లో మునిగి తేలారు. స్పెయిన్‌లో ఎక్కడ చూసినా సందడి వాతావరణం కనిపిస్తోంది.