Monday, December 23, 2024

తుపాకుల సంస్కృతికి చరమగీతం

- Advertisement -
- Advertisement -

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరఫున మరోమారు అధ్యక్ష పదవికి బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్‌పై పెన్సిల్వేనియా లో జరిగిన హత్యాయత్నం ప్రపంచాన్ని నివ్వెరపరచింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ మధ్య ఉండే అధ్యక్ష అభ్యర్థిపై పట్టపగలు జరిగిన ఈ దాడి అగ్రరాజ్యంలో పెచ్చరిల్లిపోతున్న తుపాకుల సంస్కృతిని బట్టబయలు చేస్తోంది. బట్లర్ పట్టణంలోని ఓ ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ మాట్లాడుతుండగా, చుట్టూ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు మోహరించి ఉండగా, కూతవేటు దూరంలో ఓ భవనంపై పొంచి ఉన్న 20 ఏళ్ల దుండగుడు సెమీ ఆటోమేటిక్ తుపాకీతో కాల్పులు జరపడం భద్రతా వ్యవస్థలో డొల్లతనాన్ని వేలెత్తి చూపుతోంది. ట్రంప్ రెప్పపాటు వేగంతో తల పక్కకి తిప్పి ఉండకపోతే, జరగరాని ఘోరం జరిగిపోయేది. హత్యాయత్నానికి పాల్పడిన నిందితుణ్ని సీక్రెట్ ఏజెంట్లు అక్కడికక్కడే హతమార్చి ఉండవచ్చు.

కానీ ఈ దుర్ఘటనలో ఓ అమాయకుడి ప్రాణాలు బలి కావడం, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటం విస్మరించరాని విషయం.ట్రంప్ పై హత్యాయత్నం గురించి తెలిసిన వెంటనే అధ్యక్షుడు బైడెన్ ఈ సంఘటనను ఖండిస్తూ ఈ తరహా నేరాలను ఉపేక్షించకూడదని, ఇలాంటి హింసాత్మక సంఘటనలకు వ్యతిరేకంగా అమెరికా ఏకం కావాలంటూ పిలుపునిచ్చారు. వాస్తవానికి అగ్రరాజ్యంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరిగినా దేశాధినేతలు ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం, ఆ తర్వాత చేతులు దులుపుకుని కూర్చోవడం చరిత్రను తిరగేస్తే కనిపించే సత్యాలు. అమెరికాలో తుపాకుల సంస్కృతి పెచ్చుమీరిపోతోందనడానికి ట్రంప్ పై హత్యాయత్నం ఓ తాజా ఉదాహరణ మాత్రమే. అక్కడి జనజీవనంలో గన్ కల్చర్ ఓ భాగమైపోయింది. కిరాణా దుకాణానికి వెళ్లి సరకులు కొన్నంత తేలిగ్గా, పాన్ డబ్బా దగ్గరకు వెళ్లి సిగరెట్లు కొనుక్కున్నంత సులువుగా అమెరికాలో తుపాకులు కొనుగోలు చేయవచ్చంటే అతిశయోక్తి కాదు.

ఏ దేశంలోనైనా, ఏ సమాజంలోనైనా కోపతాపాలు, కొట్లాటలు, ఘర్షణలు సహజాతి సహజం. అయితే ఏ దేశంలోనూ లేనంతగా తుపాకులు అమెరికాలో అందుబాటులో ఉండటంతో చిన్నపాటి ఘర్షణల్లో సైతం అమెరికన్లు తుపాకులకు పని చెప్పడం అలవాటుగా మారిపోయింది. ఒక్క గత ఏడాదిలోనే 18,884 మంది బలయ్యారంటే తుపాకుల వాడకం ఎంతగా మితిమీరిపోయిందో అర్ధమవుతుంది. ట్రంప్ పై హత్యాయత్నం చేసిన క్రూక్స్ 400 మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే ఎఆర్ -15 తుపాకీని వినియోగించడం భద్రతా నిపుణులను విస్మయపరిచింది. హింసా ప్రవృత్తితో రాజకీయాలను ప్రభావితం చేయాలనుకునేవారి సంఖ్య కూడా అమెరికాలో రానురాను పెరుగుతోంది. గత 150 ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే దేశాధ్యక్షులపైనా, అధ్యక్ష పదవికి పోటీపడే అభ్యర్థులపైనా జరిగిన హత్యాయత్నాలు, దాడులు కోకొల్లలుగా కనబడతాయి. ఇప్పటి వరకూ 45 మంది అమెరికా అధ్యక్షపీఠాన్ని అలంకరిస్తే, వారిలో 13 మందిపై దాడులో, హత్యాయత్నాలో జరగడం గమనార్హం.

అధ్యక్షులుగా ఉంటూ కాల్పులకు నేలకొరిగిన వారిలో అబ్రహం లింకన్, జాన్ ఎఫ్ కెనడీ, రాబర్ట్ ఎఫ్ కెనడీ వంటి వారిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఒబామా హయాంలో గన్ కల్చర్‌ను అరికట్టేందుకు ప్రయత్నాలు జరిగినా అవి సఫలీకృతం కాలేదు. ఇటీవలి కాలంలో అమెరికన్ సమాజంలో హింసా ప్రవృత్తి పెచ్చుమీరుతోందని తాజా సర్వేలు అనేకం తేటతెల్లం చేస్తున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, తాజా దాడిలో బాధితుడు అయిన డొనాల్డ్ ట్రంప్ ది కూడా దూకుడు మనస్తత్వమే. అనేక సందర్భాల్లో ఆయన కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రసంగించిన దాఖలాలు ఉన్నాయి. దానికి తోడు రిపబ్లికన్ పార్టీ కార్యకర్తల్లో అనేక మంది ఆత్మరక్షణకు తుపాకులు వాడటంలో తప్పేముందంటూ వాదించేవారే కావడం గమనార్హం.

అదే సమయంలో ట్రంప్ రాజకీయ ఎజెండా నచ్చనివారు రానున్న ఎన్నికలలో తమ ఓటు ద్వారా జవాబు చెప్పే అవకాశం ఉండగా తుపాకులను ఎంచుకోవాలనుకోవడం బాధాకరం. అగ్రరాజ్యంలో తమ హింసాయుత విధానాలతో రాజకీయాలను ప్రభావితం చేయాలనుకునేవారి సంఖ్య రానురాను మితిమీరుతోందనడానికి తాజా సంఘటనను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్య పద్ధతులలో నిరసనలు వ్యక్తం చేసే విధానాలకు స్వస్తి పలికి, అయినదానికి, కానిదానికీ తుపాకీ తీయడం సర్వసాధారణమైపోయింది. ట్రంప్ పై జరిగిన దాడి నేపథ్యంలో ఉభయ రాజకీయపక్షాలూ కలతలూ, కలహాలు పక్కనబెట్టి, తుపాకుల సంస్కృతికి అడ్డుకట్టవేసేందుకు, శాంతిభద్రతలు పరిఢవిల్లేలా చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై దృష్టి సారించడం అత్యంత ఆవశ్యకం. అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలలో ఒకటిగా చెలామణీ అవుతున్న అగ్రరాజ్యంలో జరుగుతున్న ఎన్నికలను బ్యాలెట్లు శాసించాలే తప్ప బుల్లెట్లు కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News