అస్సాం కచార్ జిల్లాలో బుధవారం జరిగిన ఒక తీవ్ర ఎన్‌కౌంటర్‌లో కనీసం ముగ్గురు అనుమానిత తీవ్రవాదులు హతం కాగా, పలువురు పోలీస్ సిబ్బంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. పోలీసులు అధికారిక ప్రకటన ఏదీ చేయకపోయినప్పటికీ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు తీవ్రవాదులను హతమార్చినట్లు గువాహటిలోని అస్సాం పోలీస్ ప్రధాన కార్యాలయంలో సీనియర్ అధికారి ఒకరు ‘పిటిఐ’కి ధ్రువీకరించారు. ‘మా సిబ్బంది కొంత మందికి గాయాలు తగిలాయి. అయితే, అవి ఎటువంటివో వెంటనే చెప్పలేం. కచార్ జిల్లా పోలీసుల నుంచి మాకు ఇంకా నివేదిక అందవలసి ఉంది’ అని ఆయన చెప్పారు. పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం, పోలీసులు మంగళవారం రాత్రి తూర్పు ధోలాయి గంగానగర్ నుంచి ముగ్గురు తీవ్రవాదులను అరెస్టు చేశారు.
వారు ఏ వర్గంవారో ఇంకా బహిర్గతం కావలసి ఉంది. ‘తీవ్రవాదులు ప్రయాణిస్తున్న ఒక ఆటోరిక్షా నుంచి ఒక ఎకె47 రైఫిల్, ఒక పిస్టల్, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక పోలీస్ బృందం ఆ ముగ్గురిని ఇతర తిరుగుబాటుదారుల అన్వేషణ నిమిత్తం బుధవారం భబన్ పర్వత ప్రాంతానికి తీసుకువెళ్లింది. ఆ సమయంలో ఎన్‌కౌంటర్ సంభవించింది’ అని వారు వివరించారు. ఒక గంట పైగా సాగిన కాల్పుల పోరులో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారని, ముగ్గురు పోలీస్ సిబ్బందికి తూటా గాయాలు తగిలాయని ఒక ప్రతినిధి చెప్పారు. ‘క్షతగాత్రులు అందరినీ చికిత్స నిమిత్తం సిల్చార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు’ అని ఆయన తెలిపారు. కచార్ ఎస్‌పి నుమల్ మహత్తా, ఇతర సీనియర్ అధికారులు వెంటనే ఆ ప్రదేశానికి వెళ్లారు.