హర్యానాలో రూ 1,392 కోట్ల మేర బ్యాంకు రుణాల మోసం కలకలం రేపింది. సంబంధిత బ్యాంక్ ఫ్రాడ్, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) రంగంలోకి దిగింది. గురువారం ఈ విషయంలో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే రావు దన్ సింగ్ , స్థానిక మెల్ ఫాబ్రికేటింగ్ కంపెనీ, దీని ప్రమోటర్ల నివాసాలపై ఇడి దాడులు సాగించింది. బ్యాంకు రుణాలలో అక్రమాలు సాగించి పెద్ద ఎత్తున డబ్బుల లావాదేవీలు సాగాయనేది ఇడి అభియోగం . హర్యానాలోని మూడునాలుగు చోట్ల, ఢిల్లీ, జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లలో కూడా ఇడి బృందాలు ఏకకాలంలోనే దాదాపు 15 చోట్ల సోదాలు నిర్వహించాయని అధికార వర్గాలు తెలిపాయి.
ఇడి వెంబడి సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసు బలగాలు (సిఎపిఎఫ్) కూడా ఉన్నాయి. మహేంద్రగఢ్ ఎమ్మెల్యే 65 సంవత్సరాల రావు దాన్ సింగ్‌కు చెందిన రెవారి వ్యవసాయ క్షేత్రం, ఆయన కుమారుడు అక్షత్ సింగ్ నివాసాలు, మరికొన్ని కంపెనీల ఆవరణల్లో కూడా సోదాలు జరిగాయి. ఎమ్మెల్యేకు చెందినది చెపుతున్న అలిడ్ స్ట్రిప్స్ లిమిటెడ్ (ఎఎస్‌ఎల్) కంపెనీ, ప్రమోటర్లతో కలిసి పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నట్లు, తరువాత వీటిని ఎమ్మెల్యే ఆయన కంపెనీలకు బదలాయించారని, ఆ తరువాత వీటిని తిరిగి చెల్లించలేదని , చివరికి రుణమాఫీ జరిగిందని సిబిఐ2022లో కేసు దాఖలు చేసింది. ఇప్పుడు ఇడి ఆర్థిక అంశాలపై దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ ఎమ్మెల్యే ఇటీవలి లోక్‌సభ ఎన్నికలలో హర్యానాలోని భివానీ మహేంద్రగఢ్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బిజెపి చేతిలో ఓడారు.