Sunday, December 22, 2024

రుణమాఫీలో దేశానికే తెలంగాణ మోడల్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని మరోసారి ఇది రుజువైందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రుణమాఫీ అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. గొప్ప కార్యక్రమంలో పాల్గొని దేశానికి ఆదర్శంగా నిలబడే అవకాశం తెలంగాణ ప్రజలు ఇచ్చారని, మంత్రివర్గ సహచరులు, అధికారుల సహకారంతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదని వారు గుర్తు పెట్టుకోవాలని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశామని ఆయన తెలిపారు. రైతు రుణమాఫీ సందర్భంగా ఈ నెలాఖరు రాహుల్ గాంధీని ఆహ్వానించి వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహిస్తామని, త్వరలో మంత్రివర్గ సహచరులతో కలిసి ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని ఆహ్వానిస్తామని సిఎం రేవంత్ తెలిపారు. గతంలో రుణమాఫీ అమలు చేస్తామని బిఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లు కాలయాపన చేసిందని ఆయన మండిపడ్డారు.

గత ప్రభుత్వం రుణమాఫీ పథకం సరిగా అమలు చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. గత పాలకులు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండుసార్లు మాట తప్పారని, మొదటి ఐదేళ్లలో కెసిఆర్ 16 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి రూ. 12 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని, రెండో సారి ప్రభుత్వంలో రూ.12 వేల కోట్లని కేవలం రూ. 9 వేల కోట్లు మాత్రమే చెల్లించారని సిఎం రేవంత్ ఆరోపించారు. పదేళ్లలో రూ.21 వేల కోట్ల రుణమాఫీకి కెసిఆర్ చెల్లించలేదని ఆయన ఆరోపించారు. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నా కెసిఆర్ ప్రజలకిచ్చిన మాటను నెరవేర్చలేదని సిఎం పేర్కొన్నారు. రైతు డిక్లరేషన్‌లో భాగంగా రైతులకు రుణమాఫీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. రూ.లక్ష రుణమాఫీ అయిన పది మంది రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలానికి చెందిన మలిపెద్ది చెన్నమ్మ (తొమ్మిదిరేకుల గ్రామం) మొదటి చెక్కును అందుకున్నారు.

సచివాలయం నుంచి ప్రారంభం
రాష్ట్రంలో రైతు రుణమాఫీ పథకం ప్రారంభమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులను జమ చేసింది. 11.50 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో రూ.6,098 కోట్ల నిధులను నేరుగా జమ చేసింది. ఈ పథకాన్ని సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీసిఎం భట్టి విక్రమార్కలు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయం నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ సంబురాల్లో కాంగ్రెస్ శ్రేణులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

తొలి విడతలో రూ.లక్ష వరకు రైతుల రుణాల మాఫీ
ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తొలి విడతలో రూ.లక్ష వరకు రైతుల రుణాలను మాఫీ చేస్తున్నామన్నారు. తొలి విడత రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్లు జమ చేస్తున్నామని సిఎం రేవంత్ తెలిపారు. రైతుల అప్పులు రూ.2 లక్షల వరకు చెల్లిస్తామని హామీ ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 9వ తేదీన రైతుల రుణాల మాఫీకి కటాఫ్ పెట్టుకున్నామని, తెలంగాణ ప్రక్రియ ప్రారంభించిన రోజు డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ కల సాకారం చేసిన సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9వ తేదీన మనందరికీ పండుగ రోజు అని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

మూడు విడతల్లో రూ.31 వేల కోట్లు మాఫీ
రెండో విడతలో రుణమాఫీకి రూ.8 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నామని సిఎం అన్నారు. అదేవిధంగా రూ.లక్షన్నర నుంచి రూ.2లక్షల వరకు ఉన్న రైతు రుణాల మాఫీకి సంబంధించి ఆగస్టు 15వ తేదీ లోపు నగదు జమ చేస్తామని, అందుకు రూ.15 వేల కోట్ల నిధులు అవసరమని ఆయన తెలిపారు. రుణాలు తీసుకున్న దాదాపు 6.36 లక్షల మందికి రేషన్ కార్టులు లేనట్లుగా గుర్తించామని ఆయన తెలిపారు. రెండో విడతలో రూ.లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూడో విడతలో రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేసి, మూడు విడత్లో మొత్తం రూ.31 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఆయన చెప్పారు.

ఆగష్టు 15వ తేదీలోగా రూ.2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. రేషన్‌కార్డు ప్రామాణికంగా రుణమాఫీ చేస్తున్నట్లు కొందరు ఆరోపణలు చేస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రుణమాఫీకి ప్రామాణికం పాసు పుస్తకమేనని, రేషన్ కార్డు కాదని సిఎం రేవంత్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిందని సిఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రతి నెలా రూ.7 వేల కోట్లు మిత్తి చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. జీతాలు, పింఛన్లు కోసం రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నామన్నారు. ఈ పథకాలకు ఏడు నెలల్లోనే రూ.29 వేల కోట్లు ఖర్చు చేశామని సిఎం రేవంత్ వివరించారు. ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సిఎం పేర్కొన్నారు. వ్యవసాయం దండుగ కాదు, పండుగ అని నిరూపించామని సిఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

16 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో మరుపురాని రోజు ఇది….
నాడు కరీంనగర్‌లో సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష తనకు తెలుసని మాట ఇచ్చారని, పార్టీకి తీరని నష్టం జరుగుతుందని తెలిసినా మాట తప్పని, మడమ తిప్పని నాయకురాలిగా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఇచ్చారని సిఎం రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకునేలా సోనియా రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. మే 6వ తేదీ, 2022న వరంగల్ లో లక్షలాది మంది రైతుల సమక్షంలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారని, సెప్టెంబర్ 17వ తేదీ, 20023లో తుక్కుగూడలో సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను ప్రకటించారన్నారు.

రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఆనాడు సోనియా గాంధీ మాట ఇచ్చారని, సచివాలయంలో కూర్చొని ధైర్యంగా తెలంగాణ రైతులకు 6,098 కోట్ల రూపాయల రుణమాఫీని వారి ఖాతాల్లో జమ చేశామని సిఎం రేవంత్ అన్నారు. తన 16 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో మరుపురాని రోజు ఇది అని, రుణమాఫీ చేసే భాగ్యం తనకు కలిగిందని సిఎం రేవంత్ అన్నారు. కెసిఆర్ కటాఫ్ పెట్టిన తేదీ మరునాటి నుంచే రుణమాఫీ అమలు చేస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన సోనియా గాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9 వరకు రుణమాఫీ కటాఫ్ గా పెట్టామని, ఏ అవాంతరాలు లేకుండా రుణమాఫీ పూర్తి చేస్తామని సిఎం రేవంత్ పేర్కొన్నారు.

రాహుల్, సోనియా, ఖర్గేలకు ధన్యవాదాలు
దొంగలు చెప్పే దొంగ మాటలను నమ్మొద్దని, ప్రతి రైతు రుణమాఫీకి కావాల్సిన చర్యలు చేపడుతున్నామని సిఎం రేవంత్ అన్నారు. సమస్యలు తలెత్తితే బ్యాంక్ అధికారులను సంప్రదించాలని, బ్యాంకు అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని, వ్యవసాయ శాఖ అధికారులు రైతు రుణమాఫీకి అన్ని ఏర్పాట్లు చేయాలని సిఎం రేవంత్ అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల స్వయంగా రైతు అని, ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క రుణమాఫీ కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయత్నం చేశారని సిఎం రేవంత్ తెలిపారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం ఒకటో తారీఖున జీతాలు ఇస్తోందని, సంక్షేమ కార్యక్రమాలకు ఏడు నెలల్లో రూ.29 వేల కోట్లు ఖర్చు చేశామని, గత ప్రభుత్వం అప్పులకు మిత్తిగా ప్రతి నెలా ఏడు వేల కోట్లు చెల్లిస్తుందన్నారు. రైతు రుణమాఫీ దేశానికి తెలంగాణ మోడల్ ఆదర్శంగా ఉండబోతుందని, ఎనిమిది నెలల్లో రుణమాఫీ హామీని నెరవేర్చి దేశంలోనే తలెత్తుకునేలా చేశామని సిఎం రేవంత్ పేర్కొన్నారు.

ఆంథోల్ నియోజకవర్గంలో 19,186 రైతు కుటుంబాలకు….
రూ.లక్ష రుణమాఫీలో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఆంథోల్ నియోజకవర్గం నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో హుస్నాబాద్, కల్వకుర్తి రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. రూ.రెండు లక్షల రుణమాఫీలో భాగంగా మొదటి విడతలో రూ.లక్ష వరకు రుణాలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం మాఫీ చేసింది. రాష్ట్రంలోని 110 నియోజకవర్గాల పరిధిలోని (9 నగర నియోజకవర్గాల్లో రైతు రుణాలు లేవు) 10,84,050 రైతు కుటుంబాలకు చెందిన 11,50,193 మంది రైతుల రుణ ఖాతాల్లో రూ.6,098.93 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. దీంతో ఆ కుటుంబాలన్నీ రుణవిముక్తం అయ్యాయి. రుణమాఫీ జరిగిన 110 నియోజకవర్గాల్లో అత్యధికంగా ఆంథోల్ నియోజకవర్గంలో 19,186 రైతు కుటుంబాలకు చెందిన 20,216 మంది రైతులకు చెందిన రూ.107.83 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. తర్వాత హుస్నాబాద్ నియోజ కవర్గంలో 18,101 రైతు కుటుంబాలకు చెందిన 18,907 మంది రైతులకు చెందిన రూ.106.74 కోట్లు, కల్వకుర్తి నియోజకవర్గంలో 17,270 రైతు కుటుంబాలకు చెందిన 18,196 మంది రైతులకు చెందిన రూ.103.02 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి.

పది మంది రైతులకు రుణమాఫీ చెక్కుల అందజేత…
రూ.లక్ష రుణమాఫీ అయిన పది మంది రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలానికి చెందిన మలిపెద్ది చెన్నమ్మ (తొమ్మిదిరేకుల గ్రామం), జర్పుల శంకర్ (చౌలపల్లి), కందుకూరు మండలానికి చెందిన చింతకింది భిక్షపతి (లేమూరు), బండి జగదాంబ (గూడూరు), ఎర్రా అండాలు (ముచ్చెర్ల), క్యాతరమోని మల్లయ్య (పెద్ద ఎల్కచర్ల-, జిల్లేడ్ చౌదరిగూడ మండలం), గొడుగు చెన్నయ్య (అగిర్యాల,- కొందుర్గ్ మండలం), మారమోని యాదమ్మ (తుమ్మలూరు-, మహేశ్వరం మండలం), అరకోటం శారద (ముక్తమదారం, -కడ్తాల్ మండలం), విట్యాల అండాలు (కృష్ణ నగర్-ఫరూఖ్ నగర్ మండలం), మల్లిగారి మాణిక్య రెడ్డి (గోపులారం -శంకర్‌పల్లి మండలం) రుణమాఫీ చెక్కులను అందుకున్నారు.

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన రైతులు….
రుణమాఫీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు వేదికల వద్ద ఉన్న రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఖమ్మం జిల్లా వి.వెంకటాయపాలెం నుంచి కుతుంబాక సీతారాం, నాగర్ కర్నూల్ జిల్లా రామాపురం నుంచి రాములమ్మ, నల్గొండ జిల్లా నుంచి తిప్పర్తి రాజు, సంగారెడ్డి నుంచి కర్రోళ్ల శివయ్య, నారాయణపేట జిల్లా ధన్వాడ నుంచి కురువలక్ష్మి, నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి రవి, ఆదిలాబాద్ జిల్లా తాంసీ నుంచి గుర్రి మహేందర్ తదితరులు వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎంతో మాట్లాడారు. రుణమాఫీ చేసినందుకు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రంలోని రైతులకు పెద్ద పండుగ: డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క
డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులకు ఈరోజు పెద్ద పండుగ అని ఆయన అన్నారు. దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజుఅని ఆయన అన్నారు. ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్న తెలంగాణ వైపు దేశం మొత్తం ఆశ్చర్యంగా చూస్తుందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర లేదని డిప్యూటీ సిఎం తెలిపారు. ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన తెలంగాణ రాష్ట్రం దేశానికి మోడల్ గా నిలుస్తుందన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలో ఐదు గ్యారంటీలు ఇప్పటికే అమలు చేయడంతో పాటు ఈరోజు రైతు రుణమాఫీ అమలు చేస్తూ మాట నిలబెట్టుకున్నామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత ధనిక రాష్ట్రాన్ని బిఆర్‌ఎస్ చేతుల్లో పెట్టినప్పటికీ లక్ష రూపాయలు రుణమాఫీని నాలుగు విడతల్లో ఐదు సంవత్సరాల్లో చేశారని ఆయన ఆరోపించారు. 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన బిఆర్‌ఎస్ లక్ష రుణమాఫీని ఐదేళ్లలో కూడా చేయలేకపోయిందన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి రూ.7 లక్షల కోట్ల అప్పుతో ఈ రాష్ట్రాన్ని తమకు అప్పచెప్పినప్పటికీ రూపాయి, రూపాయి పోగేసి నిబద్ధతతో ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అమలు చేసి చూపిస్తున్నామని ఆయన తెలిపారు.

రాహుల్ ఇచ్చిన మాట ప్రకారం రూ.31 వేల కోట్లతో రుణమాఫీ
వరంగల్ సభలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఒకేసారి రెండు లక్షలు రూపాయలు రుణమాఫీ చేస్తామని భరోసా ఇచ్చారని, ఆయన ఇచ్చిన మాట ప్రకారం రూ.31 వేల కోట్లతో రుణమాఫీ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆగస్టు 15వ తేదీ లోపు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని ఆయన తెలిపారు. భారతదేశంలో ఏ కార్పొరేట్ సంస్థ కూడా ఒకే రోజు బ్యాంకులకు 31 వేల కోట్ల రూపాయలు ఒకే సారి రుణాలు చెల్లించిన చరిత్ర ఇప్పటి వరకు లేదన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మంది రైతుల ఖాతాల్లో 31 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ డబ్బులను ప్రభుత్వం బ్యాంకులకు రైతుల పక్షాన చెల్లిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఓట్లు వేసిన ఓటర్లకు కృతజ్ఞతలు నాయకులకు పార్టీ శ్రేణులకు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు.

ఈ రోజు చారిత్రాత్మకం: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి రైతులకు రుణ మాఫీ చేసిన ఈ రోజు చారిత్రాత్మకమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. రాష్ట్రంలో రైతులంతా ఈరోజు పండుగ జరుపుకుంటున్నారన్నారు. రుణమాఫీకి నిధుల సమీకరణలో ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాము వెనక్కి తగ్గలేదని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు రుణమాఫీ విషయంలో ప్రభుత్వాన్ని అపహాస్యం చేసినా పట్టించుకోలేదని ఆయన తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని ఆయన గుర్తు చేశారు. అత్యంత కష్టతరమైన బృహత్తర కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేసి చూపించిందని ఆయన ఎమోషనల్ అయ్యారు. రైతు రుణమాఫీ విషయంలో తమ అధినాయకుడు రాహుల్‌గాంధీ మాట ఇచ్చారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక భవిష్యత్‌లో కూడా రైతులకు ప్రయోజనం చేకూర్చే పనులు చేసి తీరుతామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News