ఎనిమిది కోట్ల ఉద్యోగాలు సృష్టించామన్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం తీవ్రంగా విమర్శించారు. ప్రధాని మోడీ ‘ఒకదాని తరువాత ఒకటిగా అబద్ధం చెప్పడం’ ద్వారా యువత ‘పుండుపై కారం చల్లుతున్నారు’ అని ఖర్గే ఆరోపించారు. గడచిన మూడు నాలుగు సంవత్సరాల్లో ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించడం నిరుద్యోగితపై తప్పుడు కథనాలు వ్యాప్తి చేసేవారి నోళ్లు ‘మూతపడ్డాయి’ అని ప్రధాని మోడీ క్రితం వారం ఉద్ఘాటించిన నేపథ్యంలో ఖర్గే ఈ విమర్శ చేశారు. ఉపాధి కల్పనపై ఆర్‌బిఐ ఇటీవల విడుదల చేసిన నివేదికను ప్రధాని ఉటంకిస్తూ, ఎన్‌డిఎ ప్రభుత్వం సుస్థిరత, వృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని నొక్కిచెప్పారు.
చిన్న, పెద్ద స్థాయి మదుపరులు ఎన్‌డిఎ మూడవ హయాంను ఎంతో ఉత్సాహంతో స్వాగతించారని ఆయన తెలిపారు. ‘నరేంద్ర మోడీజీ! ఉద్యోగాలపై ఒకదాని తరువాత ఒకటిగా అబద్ధాలు చెబుతూ మీరు యువత పుండ్లపై కారం చల్లుతున్నారు’ అని ఖర్గే ‘ఎక్స్’ పోస్ట్‌లో విమర్శించారు. ‘అందుకే ఆర్‌బిఐ ప్రశ్నార్థక డేటాపై మిమ్మల్ని ప్రశ్నించాలని మేము అనుకుంటున్నాం& మీరు పది సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు వాగ్దానం చేసి 12 కోట్లకు పైగా ఉద్యోగాలను ఎందుకు పరిహరించారు?’ అని ఖర్గే తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆర్‌బిఐ నివేదికకు ఆధారమైన ప్రభుత్వ పిఎల్‌ఎఫ్‌ఎస్ డేటా ప్రకారం పని చేసే మహిళల్లో 37 శాతం మందికి వేతనాల చెల్లింపులు జరగలేదన్నది నిజం కాదా అని ఖర్గే అడిగారు.