Friday, October 18, 2024

శుభ్‌మన్ గిల్‌పై భారీ అంచనాలు

- Advertisement -
- Advertisement -

వైస్ కెప్టెన్సీతో పెరిగిన బాధ్యత

ముంబై: శ్రీలంకతో జరిగే టి20, వన్డే సిరీస్‌లలో టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఎంపికైన శుభ్‌మన్ గిల్‌పై జట్టు యాజమాన్యం భారీ ఆశలే పెట్టుకుంది. అతన్ని భవిష్యత్తు సారథిగా బిసిసిఐ పెద్దలు భావిస్తున్నారు. మూడు ఫార్మాట్‌లలోనూ జట్టుకు ప్రాతినిథ్యం వహించే సత్తా గిల్‌కు ఉంది. ఇలాంటి స్థితిలో అతన్ని వైస్ కెప్టెన్‌గా నియమించి రానున్న రోజుల్లో సారథ్య బాధ్యతలు అప్పగించాలనే లక్షంతో బిసిసిఐ ఉన్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. ఇటీవల జింబాబ్వేతో జరిగిన టి20 సిరీస్‌లో గిల్ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అతని సారథ్యంలో భారత్ 41 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా జట్టును ముందుండి నడిపించడంలో గిల్ సఫలమయ్యాడు.

కొంతకాలంగా ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమవుతున్న గిల్ ఇటీవల గాడిలో పడ్డాడు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ కీలక ఇన్నింగ్స్‌లతో జట్టు విజయాల్లో తనవంతు సహకారం అందిస్తున్నాడు. రోహిత్ శర్మ ఇప్పటికే టి20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను మరికొంత కాలం పాటే క్రికెట్‌లో కొనసాగే ఛాన్స్ ఉంది. ఇలాంటి స్థితిలో రోహిత్ వారుసుడిని తయారు చేసే పనిలో బిసిసిఐ పడింది. ఇందులో భాగంగానే గిల్‌ను వన్డేలతో పాటు టి20 సిరీస్‌లో వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. సూర్యకుమార్‌తో పోల్చితే గిల్ మూడు ఫార్మాట్‌లలోనూ అత్యంత మెరుగైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నాడు. సూర్య కేవలం టి20లలో మాత్రమే నిలకడైన ఆటను కనబరుస్తున్నాడు.

అతనితో పోల్చితే గిల్ మూడింటిలో కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు. భవిష్యత్తులో గిల్ టీమిండియాకు చాలా కీలకంగా మారుతాడని మాజీ క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, గంగూలీ తదితరులు ఇప్పటికే స్పష్టం చేశారు. గిల్ కూడా ఐపిఎల్‌లో సారథిగా గుజరాత్ టైటాన్స్‌కు మెరుగైన ఫలితాలు సాధించి పెట్టాడు. తాజాగా జింబాబ్వే సిరీస్‌లో భారత్‌ను విజేతగా నిలిపాడు. ఈ పరిస్థితుల్లో గిల్‌లో అపార నాయకత్వ ప్రతిభ దాగివుందనే విషయాన్ని సెలెక్టర్లు గుర్తించారు. అందుకే శ్రీలంక సిరీస్‌లో అతన్ని రెండు ఫార్మాట్‌లలో వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అంత ఊహించనట్టే జరిగితే రోహిత్ రిటైర్మెంట్ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా గిల్‌నే నియమించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే అందివచ్చిన అవకాశాన్ని గిల్ ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటాడనే దానిపైనే అతని భవిష్యత్తు ఆధారపడి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News