హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం తీరం వైపుకు కదులుతోంది. పూరీ తీరానికి 40 కిలో మీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రకృతమైందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఒడిశా-ఛత్తీస్‌గఢ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి పెరుగుతూ వస్తోంది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాణహిత నది వరద ప్రమాద స్థాయిని దాటి ప్రవాహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గోదావరి వద్ద నీటమట్టం 30.5 అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. చర్లలోని తాలిపేరు ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి 66900 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 18,275 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులుకాగా ప్రస్తుతం 1066 అడుగుల వరకు నీరు చేరింది.