న్యూఢిల్లీ: యుపిఎస్‌సి చైర్మన్ మనోజ్ సోని వ్యక్తిగత కారణాలు పేర్కొంటూ రాజీనామా చేసిన నేపథ్యంలో యుపిఎస్‌సి ప్రమేయం ఉన్న ప్రస్తుత వివాదం దృష్టానే ఆయనను ‘బయటకు వెళ్లేలా చేశారు’ అని కాంగ్రెస్ శనివారం ఆరోపించింది. 2014లో నరేంద్ర మోడీ ప్రధాని అయినప్పటి నుంచి రాజ్యాంగ వ్యవస్థలు అన్నిటి పవిత్రతను, స్వతంత్ర ప్రతిపత్తిని దారుణంగా దెబ్బ తీశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి) జైరామ్ రమేష్ దుయ్యబట్టారు. సోని తన పదవీ కాలం 2029 మేలో ముగియడానికి చాలా ముందుగానే వ్యక్తిగత కారణాలు పేర్కొంటూ శనివారం రాజీనామా చేశారు.
రమేష్ ఈ పరిణామంపై స్పందిస్తూ, ‘2014 నుంచి అన్ని రాజ్యాంగ వ్యవస్థల పవిత్రత, లక్షణం, స్వతంత్ర ప్రతిపత్తి, వృత్తిగత నైపుణ్యం దారుణంగా దెబ్బ తిన్నాయి. అయితే, ఒక్కొక్కసారి స్వయంప్రకటిత ప్రధాని ఇక చాలు అని చెప్పవలసి వచ్చింది’ అని వ్యాఖ్యానించారు. ‘మోడీ గుజరాత్ నుంచి తనకు ప్రీతిపాత్రమైన ‘విద్యావేత్త’ను 2017లో యుపిఎస్‌సి సభ్యునిగా తీసుకువచ్చి, ఆరు సంవత్సరాల పదవీ కాలంతో 2023లో చైర్మన్‌ను చేశారు. కానీ సదరు విశిష్ట వ్యక్తి తన పదవీ కాలం ముగియడానికి ఐదు సంవత్సరాల ముందే రాజీనామా చేశారు. కారణాలు ఏవైనా యుపిఎస్‌సి ప్రస్తుత వివాదం దృష్టా ఆయనను బయటకు వెళ్లేలా చేశారు’ అని రమేష్ పేర్కొన్నారు.