రాంచి: ఝార్ఖండ్ రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతున్న చొరబాట్లు గిరిజన జనాభా తగ్గిపోవడానికి దారి తీస్తోందని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే గిరిజనులను కాపాడేందుకు, వారి భూములు రిజర్వేషన్ల హక్కులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో 81 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇప్పటికే 52 సెగ్మెంట్లలో కమలం వికసించిందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాంచీ లోని ప్రభాత్ తారా గ్రౌండ్‌లో పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన అధ్యక్షత వహిస్తూ ప్రసంగించారు.
ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ పేరు ప్రస్తావించకుండా ఝార్ఖండ్ గిరిజన ముఖ్యమంత్రి అయిఉండీ రాష్ట్రంలో ఓటుబ్యాంకు, బుజ్జగింపు విధానం వల్లనే ల్యాండ్ జిహాదీ, లవ్ జిహాదీలకు మద్దతు ఇస్తున్నారని, జనాభా సమతుల్యతను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. చొరబాటుదార్లు ఝార్ఖండ్ రాష్ట్రంలో ప్రవేశించి గిరిజన యువతులను పెళ్లిళ్లు చేసుకుంటున్నారని, సర్టిఫికేట్లు పొంది వారి భూములను కొనుక్కుంటున్నారని , రాబోయే రోజుల్లో గిరిజనుల సంఖ్య తగ్గుతుందని ఆరోపించారు. అమిత్‌షా ఇండియా కూటమి పైన, రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ నాయకుల పైనా విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినప్పటికీ, పార్లమెంట్‌లో మాత్రం రాహుల్ గాంధీ ఎన్నోసార్లు అహంకారం ప్రదర్శించారని ఆరోపించారు.
ఎన్నికల్లో ఎవరు గెలిచారో అందరికీ తెలిసిన విషయమేనని, కానీ కొందరు ఓటమిని ఒప్పుకోలేక పోతున్నారని వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి, కాంగ్రెస్ నాయకులు రూ. 12 లక్షల కోట్ల స్కాముల్లో కూరుకుపోయినా, అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని, బుజ్జగింపు, వంశపారంపర్య రాజకీయాలతో జాతీయ భద్రతతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా బీజేపీ ఎక్కువ స్థానాలు సాధించిందని ఉదహరించారు. జెఎంఎం నేతృత్వం లోని మిత్రపక్షం, దేశం మొత్తం మీద చాలా అవినీతి ప్రభుత్వాల్లో ఒకటని, దాన్ని సాగనంపే సమయం వచ్చిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి, లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్, అర్జున్‌ముండా, తదితర బీజేపీ నేతలు పాల్గొన్నారు.