మన తెలంగాణ/ హైదరాబాద్ : కెఎస్‌జి జర్నలిస్టు ప్రీమియర్ లీగ్ (జెపిఎల్) జెర్సీల ఆవిష్కరణ కార్యక్రమం సందడిగా జరిగింది. శనివారం సికింద్రాబాద్ జింఖానా స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.జగన్మోహన్ రావు, చెన్నూర్ ఎంఎల్‌ఎ, హెచ్‌సిఎ మాజీ అధ్యక్షుడు జి.వివేక్ వెంకటస్వామి, త్రుక్ష ఫుడ్స్ ఎండి భరత్ రెడ్డి, లైఫ్ స్పాన్ సంస్థ స్పోర్ట్స్ హెడ్ భరణి, కెఎస్‌జి సిఇఒ సంజయ్, హెచ్‌సిఎ సీనియర్ సభ్యులు ఆగంరావు, స్మయిల్‌గార్డ్ ఫౌండర్ శరత్, జూపర్ ఎల్‌ఇడి ఫౌండర్ రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. ‘క్రీడారంగం అభివృద్ధి, క్రీడాకారుల అభ్యున్నతికి నిత్యం పరితపించే జర్నలిస్టులే ఆటగాళ్లుగా మైదానంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందని, అన్ని జట్లకు ఆల్ ద బెస్ట్’ అని తెలిపారు. వివేక్ మాట్లాడుతూ.. ‘జర్నలిస్టులతో తన అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని, సమాజ హిత కోసం జర్నలిస్టులు చూపించే చొరవ అందరికి ఆదర్శప్రాయమన్నారు. జెపిఎల్ విజయవంతం కావాలి’ అని ఆకాంక్షించారు.