Sunday, November 24, 2024

మూసీ అభివృద్ధి వ్యూహం వెనక ఉద్దేశమేంటి: కాంగ్రెస్ పై కెటిఆర్ ఫైర్

- Advertisement -
- Advertisement -

మూసీ అభివృద్ధి వ్యూహం వెనక ఉద్దేశమేంటి
పదిహేను పక్కన ఇన్ని సున్నాలా!! 15,000,000,000,000 
మూసీ రివర్ ఫ్రంట్ పేరిట, బ్యాక్ డోర్‌లో జరుగుతున్న
బాగోతాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోంది
కుంభకోణాల కాంగ్రెస్‌కు కర్రుగాల్చి వాతపెడుతుంది
బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: రూ.లక్షా యాభై వేల కోట్లతో మూసీ అభివృద్ధికి చర్యలు చేపడతామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శలు సంధించారు. మూసీని అందంగా ముస్తాబు చేసేందుకు తొలుత రూ.50,000 కోట్లు, తర్వాత రూ.70,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి, ఇప్పుడు ఏకంగా రూ.లక్షా యాభై వేల కోట్లు అని చెప్పడం వెనక ఉద్దేశమేంటని ప్రశ్నించారు. తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు ఖర్చు పెడితేనే గల్లీ నుంచి ఢిల్లీ వరకు గగ్గోలు పెట్టిన కాంగ్రెస్, ఇప్పుడు మూసీ సుందరీకరణకే రూ.1.5 లక్షల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తోందన్నారు.

పదిహేను పక్కన ఇన్ని సున్నాలా!! 15,000,000,000,000 అని కెటిఆర్ ఎక్స్ వేదికగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతకీ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందరు..నిల్వ ఉంచే టిఎంసిలెన్నీ..సాగులోకి వచ్చే ఎకరాలెన్ని..పెరిగే పంటల దిగుబడి ఎంత..తీర్చే పారిశ్రామిక అవసరాలెంత..కొత్త నిర్మించే భారీ రిజర్వాయర్లెన్ని..? అని ప్రశ్నించారు. పుట్టిన గడ్డపై మమకారం లేని ముఖ్యమంత్రికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కన్నా మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకింత మక్కువ..? అని అడిగారు. చివరిదశలో ఉన్న ప్రాజెక్టును పక్కనపెట్టి..కోల్డ్ స్టోరేజీలోకి నెట్టి మూసీ చుట్టే ఎందుకింత మంత్రాంగం అని పేర్కొన్నారు.

లండన్ థేమ్స్ లాగా మారుస్తామనే వ్యూహం వెనక థీమ్ ఏంటి?: లండన్‌లోని థేమ్స్ లాగా మారుస్తామనే వ్యూహం వెనక థీమ్ ఏంటి..? గేమ్ ప్లాన్ ఏంటి..? ముఖ్యమంత్రి అని కెటిఆర్ ప్రశ్నించారు. మూడింతలు పెంచిన మూసీ అంచనా వ్యయం, కాంగ్రెస్ ధనదాహానికి సజీవ సాక్ష్యం అని దుయ్యబట్టారు. మూసీ ప్రాజెక్టును చేపట్టాల్సిందే, సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాల్సిందే, కానీ మాటల దశలోనే ఉన్న ప్రాజెక్టులో మూటలు పంచుకునే పని షురూ చేస్తే సహించం అని స్పష్టం చేశారు. తట్టెడు మన్ను తీయకముందే, రూ. కోట్లు తన్నుకుపోయే కుట్రకు తెరతీస్తే భరించమన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ పేరిట, బ్యాక్ డోర్‌లో జరుగుతున్న బాగోతాన్ని తెలంగాణ సమాజం అనుక్షణం గమనిస్తోంది… కుంభకోణాల కాంగ్రెస్‌కు కర్రుగాల్చి వాతపెడుతుంది… జై తెలంగాణ అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News