Monday, January 20, 2025

అమెరికా రాజకీయాలతో మాకేం పని.. యుద్ధ లక్ష్యాలపైనే మా దృష్టి : రష్యా

- Advertisement -
- Advertisement -

మాస్కో: అమెరికా అధ్యక్ష రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ వైదొలగినట్టు ప్రకటించడంపై రష్యా తొలిసారిగా స్పందించింది. అమెరికా రాజకీయాలు ముఖ్యం కాదని, ఉక్రెయిన్ యుద్ధ లక్షాలను చేరుకోవడానికే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి పెస్కోవ్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ “ అమెరికా ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయముంది. ఈ సుదీర్ఘ సమయంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. ఏం జరుగుతుందో మనం ఓపికగా పరిశీలిస్తూ ఉండాలి. అయితే రష్యా మాత్రం ఉక్రెయిన్‌పై చేస్తున్న మిలటరీ ఆపరేషన్ లక్షాలను చేరుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుంది.” అని తెలిపారు. తమ దేశంపై రష్యా దండయాత్రను ఉక్రెయిన్ ‘యుద్ధం’గా చెబుతుండగా, రష్యా మాత్రం స్పెషల్ మిలటరీ ఆపరేషన్ అని చెప్పుకొస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధాలను అందిస్తోంది.

ఈ నేపథ్యంలో రష్యా,అమెరికా మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయి.ఇదిలా ఉండగా, మళ్లీ తాను అధికారం లోకి వస్తే ఉక్రెయిన్‌కు మద్దతు ఉపసంహరిస్తానని ట్రంప్ పలుమార్లు పరోక్షంగా ప్రకటించారు. ఇలాంటి సమయంలో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించిన కొన్ని గంటల వ్యవధి లోనే రష్యా స్పందించడం గమనార్హం. మరోవైపు బైడెన్ వైదొలగడంపై రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ టెలిగ్రామ్ వేదికగా స్పందించారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించారు. రష్యా ప్రత్యేక మిలటరీ ఆపరేషన్ లక్షాలు నెరవేరబోతున్నాయని వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News