49 అడుగులు దాటిన నీటిమట్టం
కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
మరో 24గంటల్లో తుంగభద్ర గేట్లు ఎత్తివేత
శరవేగంగా నిండుతున్న శ్రీశైలం
ఎగువ నుంచి 1.74లక్షల క్యూసెక్కుల వరద
మనతెలంగాణ/హైదరాబాద్: భద్రాచలం వద్ద గోదావరినది ఉగ్రరూపం దాల్చుతోంది. గంటగంటకు ప్రవాహ ఉధృతి పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం మధ్యాహ్నానికే గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.సాయంత్రం మరింతగా పెరిగి 49అడుగులు దాటిపోయింది.ఎగువన మహారాష్ట్ర, చత్తిస్‌గఢ్, ఒడిసా రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.గోదావరికి ఉపనదులుగా ఉన్నకడెం, ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెరసాని ,శబరి తదితర నదులు వరదనీటితో పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రాణహిత నదినుంచి వస్తున్న భారీ వరదతో మేడిగడ్డ బ్యారేజి వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో సుడులు తిరుగుతోంది.
పుష్కరఘాట్ వద్ద వరద ప్రవాహం 12.21మీటర్ల ఎత్తుకు పెరిగింది. 12.74మీటర్ల ఎత్తుకు చేరితే డెంజర్ లెవల్‌గా ప్రకటించనున్నారు. అధికారులు మొదటి హెచ్చరికను జారీ చేశారు. ప్రాణహిత నది నుంచి మేడిగడ్డ వద్ద గోదావరిలోకి 9,54,310క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. తుపాకులగూడెం వద్ద సమక్క సాగర్ మీదుగా 10,51,170క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. దుమ్ముగూడెం వద్ద ఇది మరింతగా పెరిగి 11,86,801క్యూసెక్కులు ప్రవహిస్తున్నట్టు కేంద్ర జలసంఘం అధికారులు వెల్లడించారు.
మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నది వరద భీభత్స దృశ్యాలను ఆవిష్కరిస్తోంది .క్రమంగా పెరుగుతూ వచ్చిన గోదావరి నీటిమట్టం, సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరుగుతుందని కేంద్ర జలవనరుల శాఖ హెచ్చరించింది. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గోదావరిలో వరద ప్రవాహం 9,73,163క్యూసెక్కులు ఉన్నట్టు అదికారులు వెల్లడించారు.
చర్ల మండలంలోని తాలిపేరు జలాశయం వద్ద అధికారులు 25 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోనికి విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం మండలం గుబ్బల మంగి వాగు, సీత వాగు ఉధృతంగా ప్రవహించడంతో నార చీరల ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. ప్రస్తుతం 49అడుగులను దాటి ప్రవహిస్తోన్న గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరితే అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. రాష్ట్ర ముఖద్వారంలో ఉన్న శ్రీరాం సాగర్‌లోకి 20వేలక్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటినిలువ 21.37టిఎంసీలకు చేరుకుంది. కడెం ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరువ కావటంతో ఎగువ నుంచి వస్తున్న నీటిలో 3002క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 24433క్యూసెక్కుల నీరు చేరుతోంది. నీటినిలువ 10.56టిఎంసీలకు చేరింది.
గోదావరి నీటిమట్టం – 73కి చేరితే?
భద్రాచలం వద్ద గోదావరి 48 అడుగుల స్థాయి నుంచే పలు గ్రామాలకు ముప్పు ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. గోదావరి వరద ఉధృతమయ్యే కొద్దీ దుమ్ముగూడెం మండలంతో పాటు భద్రాచలం పట్టణానికే ఎక్కువ ముంపు పొంచి ఉందని అధికారులు తెలిపారు. 43-48 అడుగుల మధ్య భద్రాచలానికి ముంపు ముంచుకొస్తుందని పేర్కొన్నారు. 48-53 అడుగుల మధ్య చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో 13 గ్రామాలు, భద్రాచలం ప్రభావితమవుతాయని వెల్లడించారు. 53-58 అడుగుల మధ్య చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లోని 48 గ్రామాలు ముంపునకు గురవుతాయన్నారు. 63 నుంచి 68 మధ్య 6 మండలాల్లోని 85 గ్రామాలు, 73 అడుగుల స్థాయికి వరద చేరితే భద్రాచలం సహా 109 గ్రామాలు ముంపు బారిన పడనున్నాయని తెలిపారు. 2023లో 73 అడుగుల స్థాయిని దాటిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏ స్థాయిలో ఏ గ్రామం ప్రభావితమవుతుందనే వివరాలను నీటి పారుదల శాఖ పోర్టల్‌లో ఉంచినట్లు ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ తెలిపారు.
శరవేగంగా నిండుతున్న శ్రీశైలం:
ఎగువ నుంచి వస్తున్న కృష్ణానదీవరద ప్రవాహంతో శ్రీశైలం ప్రాజెక్టు శరవేగంగా నిండుతూ వస్తోంది. ఎగువ నుంచి రిజర్వాయర్‌లోకి 1.74లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది.ప్రాజెక్టులో నీటినిలువ 52.15టిఎంసీలకు చేరుకుంది. ఇదే రీతిలో వరద ప్రవాహాలు కొనసాగితే మరో వారం పది రోజుల్లోనే శ్రీశైలంలో నీటినిలువ గరిష్టస్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఎగువన ఆల్మట్టిలోకి 137000క్యూసెక్కులు చేరుతుండగా, దిగువకు 150000క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నారాయణపూర్ ప్రాజెక్టు మీదుగా దిగువకు 144250క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. జారాల ప్రాజెక్టులోకి ఎగువనుంచి 1.69లక్షల క్యూసెక్కల వరద చేరుతుండగా దిగువకు 1.42లక్షల క్యూస్కెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టులోకి 1.04లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరుతుండగా, ప్రాజెక్టులో నీటినిలువ 87టిఎంసీలకు పెరిగింది. మరో 24గంటల్లో తుంగభద్ర గేట్లు తెరుచుకునే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.కృష్ణా పరీవాహకాల్లోని ప్రాజెక్టుల వద్ద ఇంజినీర్లను అప్రమత్తం చేశారు.