హైదరాబాద్: వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, సుస్థిరత సాధనకు ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో మోడీ 3.o పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. కూరగాయల సప్లయ్ చైన్ నిర్వహణకు కొత్త స్టార్టప్‌లకు అవకాశం ఇస్తామని, సేకరణ, నిల్వ, సరఫరాకు తగిన పెట్టుబడులు అందుబాటులోకి తెస్తామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కూరగాయలు ఉత్పత్తి చేసే ఆరు కోట్ల మంది రైతుల డేటా సేకరిస్తున్నామని, వినియోగానికి ఎక్కువగా ఉండే ప్రాంతాలకు దగ్గరలోనే కూరగాయల ఉత్పత్తి క్లస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే ప్రయత్నం చేస్తున్నామని, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వుల ఉత్పాదకత పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని నిర్మలా సీతారామన్ తెలియజేశారు.
సహకార రంగాన్ని సుస్థిరం చేసేందుకు నిర్మాణాత్మక విధానాలు రూపకల్పన చేస్తున్నామని, ఆహార, ఇంధనేతర ద్రవ్యోల్బణం 3.1 శాతానికి పరిమితమైందని, ద్రవ్యోల్బణం నాలుగు శాతానికి పరిమితం చేయాలనే లక్షంతో ముందుకు సాగుతున్నామని, కనీసం 50 శాతం మిగులు ఉండేలా మద్దతు ధరలు సవరించామని, విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం లక్ష 48 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని స్పష్టం చేశారు. ఉపాధి నైపుణ్య శిక్షణ, ఎంఎస్‌ఎంఇ, మధ్యతరగతి కేంద్రంగా బడ్జెట్ ఉంటుందన్నారు.
అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం చేస్తామని, అవసరాన్ని బట్టి అమరావతికి మరిన్ని అదనపు నిధులు ఇస్తామని, పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసేందుకు సంపూర్ణ సాయం అందిస్తామని ఆమె చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులకు జీవనాడి పోలవరం అని, భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైందన్నారు. ఎపిలోని వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. విశాఖ పట్నం-చెన్నై కారిడార్‌లో కొప్పర్తితో పాటు హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో ఓర్వకల్లు అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.