న్యూఢిల్లీ: దేశంలో వాణిజ్యవేత్తలను ప్రోత్సహించేందుకు ముద్ర రుణాలను గరిష్ఠ పరిమితిని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రకటించారు. తరుణ్ కేటగిరి కింది గతంలో రుణాలు పొంది వాటిని జయప్రదంగా తీర్చివేసిన వ్యాపారవేత్తలకు ముద్ర రుణాల పరిమితిని రెట్టింపు చేస్తున్నట్లు పార్లమెంట్‌లో కేంద్ర వార్షిక బద్జెట్ సమర్పణ సందర్భంగా మంత్రి ప్రకటించారు.
కార్పొరేట్ కాని, వ్యసాయేతర చిన్న, సూక్ష్మ వ్యాపారవేత్తల ఆదాయ కల్పనా కార్యకలాపాల కోసం రూ. 10 లక్షల వరకు ఎవుటవంటి పూచీకత్తు లేకుండా రూ. 10 లక్షల వరకు సూక్ష్మ రుణాలు అందచేసేందుకు ప్రధాన మంత్రి ముద్ర యోజన(పిఎంఎంవై)ను ప్రధాని నరేంద్ర మోడీ 2015 ఏప్రిల్ 8న ప్రారంభించారు. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఆర్థిక కంపెనీలు, మైక్రోఫైనాన్స్ సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలు వంటి మెంబర్ లెండింగ్ సంస్థల ద్వారా పిఎంఎంవై రుణాలు లభిస్తాయి. శిశు(రూ. 50,000 వరకు), కిశోర్(రూ. 50,000 నుంచి రూ. 6 లక్షల వరకు), తరుణ్(రూ. 10 లక్షల వరకు) అనే మూడు కేటగిరీల కింద ఇప్పటి వరకు పూచీకత్తు లేని రుణాలను ఈ పథకం కింద అందచేస్తున్నారు.