హైదరాబాద్లో నగరంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదని తెలిపారు. బస్తీలు, కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో డెంగీ, మలేరియా, అతిసారం వంటి సీజనల్ వ్యాధులతో ప్రజలు అవస్థలుపడుతున్నారని అన్నారు. చెత్త తరలింపు కేవలం కాగితాల్లో మాత్రమే కనిపిస్తోందని ఆక్షేపించారు.
నగర మేయర్, పురపాలక శాఖ అధికారుల ఆకస్మిక పర్యటనలు లేకపోవడంతో పారిశుద్ధ్యం నిర్వహణ గాడి తప్పుతోందని విమర్శించారు. పర్యవేక్షించాల్సిన పార్ట్-టైం మున్సిపల్ శాఖ మంత్రేమో ఎంఎల్ఎల కొనుగోళ్లు, ఢిల్లీ చక్కర్లలో చాలా బిజీగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. వెంటనే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి సూచించారు. హైదరాబాద్ మహా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలనిచ పౌరుల ఆరోగ్యాలు కాపాడాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.