Friday, November 15, 2024

బిజెపి చెబితే కెసిఆర్ అసెంబ్లీకి వచ్చారు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : గత ప్ర భుత్వం బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు ద ళితబంధుకు కేటాయించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. అ సెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హడావుడి అసెంబ్లీకి వచ్చిన కెసిఆర్ బడ్జెట్ ప్రసంగం పూర్తయ్య వరకు అసెంబ్లీ లో ఉండకుండా హడావుడిగా బయటకు వెళ్లి మీడియా పాయింట్ వద్ద ప్రెస్ మీట్ పెడితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన నిధుల కోసం బుధవారం అసెంబ్లీలో పెట్టిన చర్చకు కెసిఆర్ వస్తే బాగుండేదని, బడ్జెట్ ప్రసంగం పూర్తిగా వింటే కెసిఆర్‌కు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమయ్యేదని ఆయన తెలిపారు. కెసిఆర్‌కు రెస్ట్ తీసుకోమని ప్రజలు సమయం ఇచ్చారని, కేంద్రంలో ఉన్న బిజెపి నాయకులు చెబితే హడావుడిగా అసెంబ్లీకి వచ్చి హడావుడిగా బయటకు వెళ్లి కెసిఆర్ ప్రెస్‌మీట్ పెట్టినట్టున్నారని డిప్యూటీ సిఎం ఎద్దేవా చేశారు.

దళితుల పట్ల కెసిఆర్ నిర్లక్షంగా వ్యవహారించారు
గతంలో దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారించిన మాజీ సిఎం కెసిఆర్ ఈ బడ్జెట్‌లో దళిత బంధు గురించి ప్రస్తావించలేదని మాట్లాడటం నవ్వాలా? ఏడ్వాలో? అర్థం కావడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను గత ప్రభుత్వం మాదిరిగా తాము పక్కదారి పట్టించమన్నారు. బ్యాక్ లాగ్ నిధులను కలుపుకొని దళిత, గిరిజనులకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు పెడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమం- అభివృద్ధికి సమభాగంలో నిధులు వెచ్చిస్తూ మేలు కలయికతో ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. హైదరాబాద్ మౌలిక వసతుల కల్పనకు ఎన్నడు లేని విధంగా ఈ బడ్జెట్‌లో పది వేల కోట్ల రూపాయలు కేటాయించామన్నారు.

నగర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం
నగర అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని అభివృద్ధి చేస్తోందన్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగ వ్యవస్థలు రావడానికి కావాల్సిన ఎకో సిస్టంను అభివృద్ధి చేయడానికి కావాల్సిన నిధులను పెట్టుబడిగా పెడుతూ తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మణిహారంగా ఉన్న హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం ప్రాధాన్యత అంశంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. భవిష్యత్ తరాలకు అవసరమయ్యే హ్యూమన్ రీసోర్స్ తయారీ కోసం హైదరాబాద్‌లో పునాదులు వేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం విజీన్‌తో తీసుకున్న మిషన్‌గా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థపై పెద్ద ఎత్తున ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నామన్నారు. అంగన్ వాడీలను మూడో తరగతి వరకు అప్ గ్రేడ్ చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో 4వ తరగతి నుంచి అడ్మిషన్లు తీసుకునేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.

మహిళా సంఘాలకు హైదరాబాద్‌లో మూడున్నర ఎకరాలు
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుతో దేశానికి మొత్తం తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలువబోతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ఫోకస్ పెట్టి బడ్జెట్‌లో పెద్దపీట వేశామన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా ఉండబోతుందన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కసరత్తు పూర్తయిందని, నిధులను సైతం కేటాయించామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని ప్రభుత్వం మహిళా సంక్షేమానికి బడ్జెట్‌లో నిధులను కే టాయించిందన్నారు. ప్రతి సంవత్సరం మహిళా సంఘాలకు 20వేల కోట్ల వడ్డీ లేని రుణాలిప్పిస్తామని, వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు.

ప్రతి నియోజకవర్గంలో మైక్రో స్మాల్ ఇండస్ట్రీయల్ పార్క్
ప్రతి నియోజకవర్గంలో మైక్రో స్మాల్ ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని, మహిళలు ఆర్థిక సాధికారత సాధించడానికి మైక్రో స్మాల్ ఇండస్ట్రీలను వారికి కేటాయించబోతున్నామని ఆయన తెలిపారు. ప్రజా ప్రభుత్వం వారికి అందించే ప్రోత్సాహకాల వల్ల మహిళలు ఆర్థిక పరిపుష్టి తో ఆర్థిక సాధికారత సాధించి దేశానికి ఆదర్శంగా నిలుస్తారన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను మహాలక్ష్మిలుగా కొలుస్తామని, డ్వాక్రా సంఘాలు ఉత్పత్తి చేసే వస్తువులను మార్కెటింగ్ చేసుకోవడానికి హైదరాబాద్‌లో మూడున్నర ఎకరాలు భూమిని మహిళల కోసం కేటాయించామని, రాష్ట్రంలో మహిళల కోసం సమానమైన దృష్టిని తమ ప్రభుత్వం కేంద్రీకరించి వారి అభివృద్ధికి పాటుపడుతుందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News