స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదును ఎఫ్‌ఐఆర్ చేసేందుకు ఫిర్యాదు ఇచ్చిన వారి నుండి రూ.20 వేలు లంచం తీసుకొంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ ఎస్‌ఐ గురువారం ఏసిబికి పట్టుబడటం సంచలనం సృష్టించింది. ఏసిబి డిఎస్‌పి వై. రమేష్ , ఫిర్యాదుదారుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి … పట్టణానికి చెందిన శీరపు శ్రావణి దగ్గర బాలసాని గణేష్ అప్పుగా నగదు తీసుకున్నారు. తాను ఇచ్చిన నగదును తిరిగి ఇవ్వాలని పలుమార్లు గణేష్‌ను కోరగా వాయిదాలపై వాయిదాలు పెడుతూ సాగదీస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల గణేష్ మృతిచెందటంతో తన అప్పు వసూలు కోసం ప్రాపర్టీ అటాచ్‌మెంట్‌కై కోర్టును ఆశ్రయించారు. కోర్టు అటాచ్‌మెంట్ ప్రక్రియలో ఉన్న ఆస్తిని చావా శ్రీను అనే వ్యక్తి కొనుగోలు చేశాడు.
ఈ విషయంపై శ్రావణి చావా శ్రీనును అడగగా దీనికి కోపంతో శ్రీనుతో పాటు మరికొందరు ఆమెను బెదిరించారని మే నెల 19వ, తేదీన పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నెలలు గడుస్తున్నప్పటికీ ఎస్‌ఐ పట్టించుకోవటం లేదని లాయర్‌ను శ్రావణి సంప్రదించారు. సదరు లాయర్ లక్షారెడ్డి కోర్టు ద్వారా బెదిరించిన వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ చేయాలని గడువుతో కూడిన ఆదేశాలు పంపించారు. దానితో ఎస్‌ఐ బానాల రాము లాయర్ లక్షారెడ్డిని తన వద్దకు పిలిపించుకొని కేసులో చార్టిషీట్ వేయటానికి రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారని తెలిపారు. ఈ విషయంపై లాయర్ ఈ నెల 19వ, తేదీన ఏసిబి డిఎస్‌పికి ఫిర్యాదు చేశారు. దీనితో రంగంలోకి దిగిన ఏసిబి అధికారులు లక్షారెడ్డి వద్ద నుండి ఎస్‌ఐ రాము తన ఇంటి వద్ద లంచం తీసుకొంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు.