Friday, October 18, 2024

ఉనికి కోసమే పాక్ ‘ఉగ్రవాదం, పరోక్ష పోరు’: మోడీ

- Advertisement -
- Advertisement -

డ్రాస్ (కార్గిల్) : పాకిస్తాన్ చరిత్ర నుంచి పాఠాలు ఏవీ నేర్చుకోలేదని, అది దుస్సాహసానికి ఒడగట్టినప్పుడల్లా పరాజయాన్నే చవి చూసిందని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం చెప్పారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఇక్కడ సైనికులకు ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. ఉగ్రవాదం, పరోక్ష యుద్ధం ద్వారా ఉనికి చాటుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నదని, అయితే, ఏదైనా దుస్సాహసానికి ఒడిగట్టినప్పుడల్లా దానికి ఓటమే ఎదురైందని ఆయన చెప్పారు. ‘ఉగ్రవాద గురువులు నా వాణిని నేరుగా వినగలిగే ప్రదేశం నుంచే నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. వారి దుష్ట వ్యూహాలు ఎన్నటికీ నెరవేరవని ఉగ్రవాద ప్రోత్సాహకులకు చెప్పదలిచాను’ అని మోడీ తెలిపారు.

‘మా సాహస వీరులు ఉగ్రవాదాన్ని అణచివేస్తారు, శత్రువుకు గట్టి గుణపాఠం నేర్పుతారు’ అని ఆయన నొక్కిచెప్పారు. జమ్మూ ప్రాంతంలో ఉగ్ర ఘటనలు పెచ్చుమీరిన నేపథ్యంలో ప్రధాని ఆ వ్యాఖ్యలు చేశారు. ‘కార్గిల్‌లో మేము యుద్ధం మాత్రమే గెలవలేదు, మేము సత్యానికి, సంయమనానికి, బలానికి సంబంధించి అద్భుత ఉదాహరణ ఇచ్చాం’ అని మోడీ స్పష్టం చేశారు. లడఖ్‌లోని కార్గిల్ మంచు శిఖరాల్లో సుమారు మూడు నెలలకు పైగా పోరులో విజయం సాధించినట్లు వెల్లడించి, ‘ఆపరేషన్ విజయ్’ జయప్రదంగా ముగిసిందని భారతీయ సైన్యం 1999 జూలై 26న ప్రకటించింది. యుద్ధంలో పాకిస్తాన్‌పై భారత్ విజయానికి గుర్తుగా జూలై 26న ‘కార్గిల్ విజయ్ దివస్’ పాటిస్తున్నారు. లడఖ్, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిలో ప్రతి ఒక్క ప్రతిబంధకాన్ని భారత్ తోసిరాజంటుందని ప్రధాని స్పష్టం చేశారు.

అగ్నీపథ్‌పై ప్రతిపక్షాన్ని తూర్పారబట్టిన ప్రధాని
ఇది ఇలా ఉండగా, సైన్యం చేపట్టిన అత్యవసర సంస్కరణలకు ఒక ఉదాహరణ అగ్నీపథ్ పథకం అని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. సాయుధ బలగాల్లో సగటు వయస్సును తక్కువగా ఉంచడమే లక్షంగా గల నియామక ప్రక్రియపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మోడీ ఆరోపించారు. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నిత అంశంపై కొందరు వ్యక్తులు రాజకీయం చేస్తున్నారని ప్రధాని విమర్శించారు, పింఛన్ డబ్బు ఆదా కోసమే అగ్నీపథ్ పథకాన్ని ప్రారంభించారన్న ఆరోపణలను ఆయన కొట్టివేశారు. ‘అగ్నీపథ్ లక్షం సైన్యాన్ని తక్కువ వయస్సులో ఉండేలా చేయడమే& అగ్నీపథ్ లక్షం సైన్యం సదా యుద్ధానికి ఫిట్‌గా ఉండేలా చేయడం’ అని ఆయన చెప్పారు. ‘దురదృష్టవశాత్తు జాతీయ భద్రతకు సంబంధించిన అటువంటి సున్నిత అంశాన్ని కొంత మంది వ్యక్తులు రాజకీయ విషయంగా మార్చారు. ఈ సైన్యం సంస్కరణపై సైతం తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు అసత్య రాజకీయాలు ఆడుతున్నారు’ అని ప్రధాని ఆక్షేపించారు.

అగ్నీపథ్ పథకం సైన్యం చేపట్టిన అత్యవసర సంస్కరణలకు ఒక తార్కాణం అని మోడీ పేర్కొన్నారు. ‘సాయుధ బలగాలను తక్కువ వయస్కులుగా ఉండేలా చేయడానికి దశాబ్దాలుగా పార్లమెంట్‌లోను, వివిధ కమిటీల్లోను చర్చలు జరిగాయి. భారతీయ సైనికుల సగటు వయస్సు ప్రపంచ సగటు కన్నా అధికంగా ఉండడం కలవరం కలిగిస్తున్నది’ అని ఆయన చెప్పారు. పలు కమిటీల్లో ఏళ్ల తరబడి ఈ అంశాన్ని లేవదీశారని, కానీ ఈ జాతీయ భద్రత సవాల్‌ను పరిష్కరించాలనే దృఢసంకల్పం గతంలో వ్యక్తం కాలేదని ఆయన తెలిపారు. ‘అగ్నీపథ్ పథకం ద్వారా ఈ సమస్యను దేశం అధిగమించింది’ అని ప్రధాని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ ప్రతిపక్షాలను లక్షం చేసుకుంటూ, ‘సైనిక బలగాల్లో వేల కోట్ల రూపాయలు విలువ చేసే కుంభకోణాలకు పాల్పడి మన దళాలను బలహీనపరచింది ఈ వ్యక్తులే’ అని ఆరోపించారు.

వీరికి భారత వైమానిక దళం ఆధునిక ఫైటర్ జెట్లు పొందడం ఇష్టం లేదని, వీరు ‘తేజస్ యుద్ధ విమానాన్ని ఒక పెట్టెలో బందీని చేసేందుకు సన్నాహాలు చేశారు’ అని ఆయన విమర్శించారు. పింఛన్ డబ్బు ఆదా చేయడానికే అగ్నీపథ్ పథకాన్ని ప్రారంభించారన్న వాదనలను కూడా ప్రధాని తోసిపుచ్చారు. ‘పింఛన్ డబ్బు ఆదా చేయడానికే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చిందనే అపోహను కొందరు కలిగిస్తున్నారు. ఇప్పటి రిక్రూట్లకు పింఛన్ సమస్య 30 ఏళ్ల తరువాతే రానున్నప్పుడు ప్రభుత్వం ఈ నిర్ణయాన్నిర ఇప్పుడు ఎందుకు తీసుకుంటుందని అటువంటి వ్యక్తులను అడగదలిచాను’ అని ప్రధాని చెప్పారు. ‘మాకు రాజకీయాల కన్నా దేశ భద్రతే పరమావధి’ అయినందున సైన్యం నిర్ణయాన్ని తన ప్రభుత్వం మన్నించిందని ప్రధాని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News