Sunday, November 24, 2024

హైదరాబాద్‌కు నిధులు తీసుకరావడంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు విఫలం: పొన్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరం అభివృద్ధికి ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశంసించారు. హైదరాబాద్‌కు రూ.10 వేల కోట్లు ఇచ్చిన సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు పొన్నం ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. గతంలో టూరిజం మంత్రిగా పని చేసిన కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు ఒక్క రూపాయి తీసుకురాలేదని, గతంలో స్మార్ట్ సిటీ వస్తే కరీంనగర్‌కు ఇచ్చారని, హైదరాబాద్ నగర అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తీసుకవచ్చారో చెప్పాలని నిలదీశారు. హైదరాబాద్‌కు రూపాయి తీసుకురాలేని వాళ్లు కేంద్రమంత్రులుగా ఉండే అర్హత లేదని చురకలంటించారు.

హైదరాబాద్‌కు నిధులు తీసుకరావడంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు హైదరాబాద్ నగరానికి స్మార్ట్ సిటీ నిధులు తీసుకరావాలని పొన్నం డిమాండ్ చేశారు. విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని స్పష్టం చేశారు. బలహీన వర్గాల రిజర్వేషన్లకు ఇబ్బందులు లేకుండానే పంచాయతీ ఎన్నికలకు వెళ్తామని వివరించారు. విహారయాత్రలకు వెళ్లినట్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు బిఆర్‌ఎస్ నేతలు వెళ్లారని, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఇచ్చి అల్టిమేటంకు ఎవరూ భయపడే ప్రసక్తే లేదన్నారు.

రైతులను కాపాడే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని పొన్నం హామీ ఇచ్చారు. గంగా ప్రక్షాళనకు మోడీ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేసిందని, కానీ మూసీ అభివృద్ధికి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని,  అందుకే నిరసన తెలియజేయడం కోసమే నీతిఅయోగ్ సమావేశాన్ని బైకాట్ చేస్తున్నామని చెప్పారు. తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టకపోవడం వల్ల భారీ నష్టం జరిగిందని పొన్నం వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News