ఏడాది క్రితం అపహరణకు గురైన ముగ్గురు మైనర్ బాలికలను హైదరాబాద్, నాందేడ్‌లో కనిపెట్టిన మహారాష్ట్రలోని లాతూర్ పోలీసులు వారిని రక్షించి, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం అధికారి ఒకరు శనివారం తెలిపారు. సాంకేతిక విశ్లేషణ, ఆధారాల అనుసరణ ద్వారా బాలికల ఆచూకీని పోలీసులు కనిపెట్టినట్లు ఆయన చెప్పారు. 17 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలు అదృశ్యమైనట్లు ఏడాది క్రితం లాతూర్ జిల్లాలోని ఉద్గిర్ రూరల్, నిలంగ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. 16 ఏళ్ల ఒక బాలిక అపహరణ గురించి ఎంఐడిసి పోలీసు స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. 17 ఏళ్ల ఇద్దరు బాలికలను హైదరాబాద్‌లో గుర్తించగా మరో బాలికను నాందేడ్ జిల్లాలో కనిపెట్టినట్లు ఆ అధికారి తెలిపారు. ఈ ముగ్గురు మైనర్ బాలికలను రక్షించిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. గడచిన 45 రోజులలో లాటూర్ జిల్లా నుంచి అపహరణకు గురైన 10 మంది మైనర్ బాలికలను పోలీసులు రక్షించినట్లు ఆయన చెప్పారు.