Thursday, September 19, 2024

గేట్లు తెరవడానికి మీరు పోటుగాళ్లా..?

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లను ఆగస్టు రెండు నాటికి తెరకపోతే తాము తెరుస్తామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ ఇచ్చిన అల్లిమేటం ఇవ్వడంపై రాష్ట్ర రవావాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్లు తెరవడానికి మీరు పోటుగాళ్లా, కెటిఆర్ యువరాజు కాదు..ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని పొన్నం ఘాటుగా జవాబిచ్చారు. పంప్ హౌస్ ఆన్ చేసి గేట్లు తెరుస్తమనడానికి మీరేమన్నా పోటుగాళ్లా, ఏం చేయాలో మాకు తెలుసునని మంత్రి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ధ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీఎస్‌ఏ సూచనల మేరకే ప్రభుత్వం నడుచుకుంటుందని స్పష్టం చేశారు. తమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టకపోవడం వల్ల, కాళేశ్వరం నిర్మాణం వల్ల రాష్ట్రానికి భారీ నష్టం జరిగిందని ఆరోపించారు. విహార యాత్రకు వెళ్లినట్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆరెస్ ఎమ్మెల్యేల బృందం వెళ్లిందని విమర్శించారు. బిఆరెస్ నేతలు కాళేశ్వరంపై తప్పులు ఒప్పుకొని ముక్కు నేలకు రాయాలని అన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం జరినందునే నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరించాం
కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం జరిగినందున నిరసన వ్యక్తం చేసేందుకే నీతి అయోగ్ సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి బహిష్కరించారని అన్నారు. గతంలో కారణం లేకుండానే కెసిఆర్ నీతి అయోగ్ సమావేశానికి వెళ్లలేదని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించిన సీఎంకు, డిప్యూటీ సీఎంకు హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నందుకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. జీహెచ్‌ఎంసీ, వాటర్ బోర్డు, మెట్రోలకు ప్రభుత్వం ఆర్థిక మద్దతునందించిందన్నారు. హైదారాబాద్‌కి సంబంధించి మెట్రో అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఆర్థిక లేమితో కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. నూతనంగా హైడ్రా, మూసి ప్రక్షాళన, మెట్రో ఇతర అంశాలకు రూ.10 వేల కోట్లు కేటాయించారని అన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు ఏం తెచ్చారని ప్రశ్నించారు.

టూరిజం మంత్రిగా ఉన్నా కిషన్ రెడ్డి రాష్ట్రానికి చేసిందేమి లేదని, హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నిధులు తెచ్చి కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధి ని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు కేంద్ర మంత్రులు అయినా రాష్ట్రానికి ఉపయోగం లేకుండా పోయిందన్నారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రలుగా కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. కేంద్రం నుండి హైదారాబాద్ కి ఏం తెస్తారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్ల నిధులు ఇచ్చినందుకా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్నారని బీజేపీ శ్రేణులపై మంత్రి పొన్నం మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ ప్రిపరేషన్‌కు ముందే రాష్ట్ర అవసరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని, అయినా సహకారం దక్కలేదన్నారు.

మూసీ అభివృద్ధికి ఎందుకు నిధులివ్వరు
గంగా ప్రక్షాళనకు బడ్జెట్ కేటాయింపులు చేసిన కేంద్రం, మూసీ అభివృద్ధికి ఎందుకు నిధులివ్వరని ప్రశ్నించారు. నిధుల సాధనకు కేంద్రం వద్దకు కిషన్‌రెడ్డి అఖిల పక్షాన్ని తీసుకెళతామంటే తమ ప్రభుత్వం సిద్ధమని తెలిపారు. ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు బడ్జెట్ సవరణల ద్వారా హైదారాబాద్ అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి నిధులు తెచ్చి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. ఏస్‌ఆర్డిపి, ఎస్‌ఎన్డీపీ ద్వారా రోడ్ల నిర్మాణాలు, నాళాల పునరుద్ధరణ చేపట్టడానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తాగు నీటికి అమృత్ పథకం కింద నిధులు కేటాయించాలని తెలిపారు. విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని పేర్కొన్నారు.

బలహీన వర్గాలకు రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని అన్నారు. బడ్జెట్ లోని ప్రతి అంశం కేటాయింపులో బీసీలకు భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు. బలహీన వర్గాలకు అన్యాయం జరగనిచ్చే పరిస్థితి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎస్సి, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు న్యాయం జరగాలని ముఖ్యమంత్రి, మంత్రి వర్గం భావిస్తుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా బలహీన వర్గాల రిజర్వేషన్లకు సంబంధించి ఓటర్ల జాబితా రావాల్సి ఉందని అన్నారు. బీసీ గణన జరగాలి, దాని తర్వాతనే ఎన్నికలకు పోవాలని ఎన్నికలకు జాప్యం అవుతుందన్నారు. ప్రభుత్వం బీసీల పట్ల అంకిత భావంతో ఉందన్నారు. గత ప్రభుత్వం కేంద్రంతో డిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీలా వ్యవహరించిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News