భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్న ఢిల్లీలో మరొక విషాదం చోటు చేసుకుంది. రాజేందర్ నగర్ ప్రాంతంలోని ఒక ఐఎఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి వరద పోటెత్తడంతో విద్యార్థులు చిక్కుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. సివిల్ సర్వీసెస్ అభ్యర్థులు ముగ్గురు ఈ ఘటనలో మరణించారు. ఈ సంఘటనపై ఆ ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సంఘటన సందర్భంగా కోచింగ్ సెంటర్ యజమానిని, కో ఆర్డినేటర్‌ను ఆదివారం అరెస్టు చేశారు. బేస్‌మెంట్‌ను ఒక స్టోర్ రూమ్‌గా వినియోగించేందుకు కోచింగ్ సెంటర్‌కు అనుమతి ఉందని, కానీ నిబంధనలకు విరుద్ధంగా దానిని లైబ్రరీగా ఉపయోగిస్తున్నారని అధికారులు వెల్లడించారు. భవనం నిబంధనలను ఉల్లంఘించి వాణిజ్య అవసరాలకు బేస్‌మెంట్లను వినియోగిస్తున్న సంస్థలపైన, ఈ సంఘటనకు ఎవరైనా అధికారులు బాధ్యులైతే వారిపైన కఠిన చర్య తీసుకోవాలని ఎంసిడి కమిషనర్‌ను ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ ఆదేశించారు.
అగ్నిమాపక శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థ పని చేస్తున్నదని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ చెప్పారు. అరెస్టయిన నిందితులను కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కో ఆర్డినేటర్ దేశ్‌పాల్ సింగ్‌గా గుర్తించారు. కోచింగ్ సెంటర్‌లో ఏజెన్సీల తనిఖీలు శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత కూడా కొనసాగాయి. ఏడు గంటల తరువాత సోదాలు ముగిసాయి. ఈ సంఘటనలో మృతులను తెలంగాణకు చెందిన తన్యా సోని, ఉత్తర ప్రదేశ్ అంబేద్కర్ నగర్‌కు చెందిన శ్రేయా యాదవ్, కేరళ ఎర్నాకుళంకు చెందిన నవీన్ డాల్విన్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్‌ఎంఎల్ ఆసుపత్రిలో మృతుల బంధువులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తాము ఉదయం నుంచి నిరీక్షిస్తున్నా మృతదేహాలను చూసేందుకు తమను అనుమతించలేదని వారు ఆరోపించారు. లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ముగ్గురు ఐఎఎస్ అభ్యర్థుల మృతికి సంతాపం ప్రకటించారు.
\భద్రంగాలేని నిర్మాణం, నాసిరకం పట్టణ ప్లానింగ్, సంస్థల బాధ్యతారాహిత్యం వల్ల సామాన్య ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఢిల్లీ బిజెపి చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా ఈ సంఘటనను ‘హత్య’గా అభివర్ణించారు. ఢిల్లీలో తమ భవిత నిర్మాణం కోసం వచ్చిన విద్యార్థులు ‘అవినీతి బాధితులుగా మారారు’ అని సచ్‌దేవా అన్నారు.