Friday, December 20, 2024

ఎన్‌టిపిసి విద్యుత్ అక్కర్లేదా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్‌ః కేంద్ర విద్యుత్ రంగ సంస్థ ఎన్టీపీసీ నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్ తెలంగాణకు అవసరం లేదా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్టీపిసితో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పిపిఏ) చేసుకోవాలని ఎన్నిసార్లు లేఖలు రాసినా ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ప్రాజెక్టు వేరే రాష్ట్రానికి వెళితే తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టమని తెలిపారు. పిపిఏపై రాష్ట్ర ప్రభుత్వం అలసత్వంగా ఉండటంతో ఆయన ఘాటుగా స్పందించారు. ఆదివారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో రాష్ట్ర సర్కార్ తీరుపై ధ్వజమెత్తారు. తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రాష్ట్రప్రజలకు వీలైనంత ఎక్కువ విద్యుత్‌ను అందుబాటులో ఉంచాలనుకున్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు.

దీనిలో భాగంగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టే ప్రాజెక్టుకు ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని తెలిపారు. దీనిలో మొదటి విడతగా 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు పవర్ ప్లాంట్లను ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందని వివరించారు. రూ.10,598.98 కోట్లతో చేపట్టిన ఈ రెండు పవర్ ప్రాజెక్టుల్లో మొదటి 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను గతేడాది అక్టోబర్‌లో, రెండో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను ఈ ఏడాది మార్చిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారని తెలిపారు. ఈ 1600 మెగావాట్ల ప్రాజెక్ట్‌లో 85 శాతం విద్యుత్‌ను తెలంగాణ అవసరాలకే వినియోగిస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ 4 వేల మెగావాట్ల ప్రాజెక్టులో మిగిలిన 240 మెగావాట్ల ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా ప్రారంభించుకుని, రాష్ట్రంలో విద్యుత్ భద్రత కల్పించాలని కేంద్రం భావిస్తుందని ఆయన వివరించారు. ఇందుకు ఎన్టీపీసీతో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ ట్రాన్స్‌కో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పిపిఏ) చేసుకోవాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి ఆ ప్రకటనలో తెలిపారు.

దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న పరిస్థితుల్లో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్- 2 ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి పెంచాలనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన అని పేర్కొన్నారు. పిపిఏ విషయంలో త్వరగా స్పందించి సహకరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు సార్లు లేఖలు రాసినా స్పందన రాలేదని ఆయన కేంద్రమంత్రి అసహనం వ్యక్తం చేశారు. ట్రాన్స్‌కో నుంచి కూడా ఎలాంటి సమాధానం లభించలేదని పేర్కొన్నారు. ఇన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ -II ప్రాజెక్టు నుంచి విద్యుత్ కొనుగోలు చేసే ఆసక్తి లేదన్నట్లుగానే భావించాల్సి వస్తుందని ఎన్టీపీసీ ఇప్పటికే ఆ లేఖలో పేర్కొందన్న విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. దీంతో రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆయన విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News