Monday, December 23, 2024

ఎంఐఎంకు కెసిఆర్, రేవంత్ ఇద్దరూ లొంగిపోయారు

- Advertisement -
- Advertisement -

గతంలో టిఆర్‌ఎస్ కారు స్టీరింగ్ మా చేతిలో ఉందన్నా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం పట్టనట్టే ఉన్నాడని, ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా మజ్లిస్ కు పూర్తిగా లొంగిపోయిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. అసెంబ్లీలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ఆయన దురహంకారానికి నిదర్శనమని అన్నారు. ఎవరో ఒక పోలీస్ తప్పు చేస్తే మొత్తం పోలీస్ వ్యవస్థను, పోలీసుల ఆత్మ ధైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. సోమవారం బండి సంజయ్ హైదరాబాద్‌లో ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేశారు. పాతబస్తీలో ట్రాఫిక్ చలాన్లు కట్టకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా, చట్టాలను ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ఎంఐఎం గుండాలపై పోలీసులు చట్ట ప్రకారం తీసుకోవాల్సిందేనని అన్నారు. రాత్రి 10 దాటితే పాతబస్తీలో పోలీసులు రావద్దని అక్బరుద్దీన్ ఓవైసీ అంటున్నారని,

పాతబస్తీ ఏమైనా ఓవైసీ జాగీరా? లేక పాతబస్తీ ఏమైనా పాకిస్తాన్ లో ఉందని భావిస్తున్నాడా? లేక ఇంకా నిజాం రజాకార్ల పాలనే కొనసాగుతుందని అనుకుంటున్నాడా? అని బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. రాత్రి 10 తర్వాత ఓల్డ్ సిటీలో నేనే ఉంటా, పోలీసులు ఎట్లా వస్తారో చూస్తా అని అక్బరుద్దీన్ బెదిరింపులకు దిగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం కాంగ్రెస్ చేతకానితనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. పాతబస్తీ లో కరెంట్ నష్టాలు రావడం లేదని అక్బరుద్దీన్ మాట్లాడితే ప్రభుత్వం వత్తాసు పలకడం సిగ్గుచేటని అన్నారు. సర్కారుకు దమ్ముంటే కరెంట్ నష్టాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ముందు భారీ బహిరంగ సభ నిర్వహించి జైశ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లిలా చేశాం, ఇప్పుడు పాతబస్తీ మా అడ్డా ఎవరు రావద్దంటే ఊరుకునేది లేదని, బిజెపి సత్తా చూపిస్తామని, అక్బరుద్దీన్‌కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయాలంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News