సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గం అభివృద్ధికి నిధులు ఇస్తారా..? లేక మమ్మల్ని పక్కన ఉన్న మహారాష్ట్రలో కలుపుతారా..? అని సిర్పూరు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో నీటిపారుదల ప్రాజెక్టులపై మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ‘మా ప్రాంతంపై ఎందుకో చిన్నచూపు, తీవ్ర వివక్ష ఉందని అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్ కేటాయింపులూ లేవు, ప్రాజెక్టులూ లేవని ఆవేదన వ్యక్తం చేస్తూ నిధులైనా ఇవ్వండి లేదంటే మమ్మల్ని మహారాష్ట్రలో కలపండి’ అంటూ ఎమ్మెల్యే హరీష్‌బాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. బీజేపీ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కాకరేపాయి. ఉత్తర తెలంగాణపై వివక్ష ఎందుకు చూపుతున్నారని నిలదీశారు. తుమ్మిడిహెట్టికి కేంద్రం సహకరిస్తుందని అన్నారు.
తమ ప్రాంతానికి బడ్జెట్లో నిధుల కేటాయింపులు లేవని ఆవేదన చెందారు. తమకు జీవన ప్రమాణాలు పెంచి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉత్తర తెలంగాణ ప్రజల నోటికాడి ముద్దను లాక్కెళ్లారని మండిపడ్డారు. దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ద ఉత్తర తెలంగాణ మీద కూడా చూపాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ మీద వివక్షే, ఇప్పుడు ప్రత్యేక తెలంగాణలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీద వివక్ష చూపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతాల అభివృద్ధి కోసం హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టవచ్చని అన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని చెప్పారు. అవసరమైతే బీజేపీ ఎమ్మెల్యేలు అందరం కలిసి వెళ్లి కేంద్రాన్ని ఒప్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.